బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతున్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం - కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుపాను ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 190 కి.మీ, కాకినాడకు 270 కి.మీ, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు నిర్ధారించారు. తీరం దాటే సమయంలో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన అలలు తీరంపై విరుచుకు పడుతున్నాయి. తుపాను తీవ్రత పెరుగుతుండటంతో ఏపీలోని పోర్టులను విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ చేసింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరో ప్రమాద హెచ్చరికను, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
రాష్ట్రంలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు మొదలవడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. కాకినాడ జిల్లాలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉప్పాడ తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీని ధాటికి ఉప్పాడ - కాకినాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అలల తాకిడికి భారీ రాళ్లు రోడ్డుపైకి కొట్టుకువచ్చాయి. తీరప్రాంత గ్రామాల్లోని ఇళ్లు కోతకు గురవడంతో, స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక కోనసీమ జిల్లా వ్యాప్తంగా అర్థరాత్రి నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సముద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos