ఇవాళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి. పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధి దగ్గర కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి నివాళులు అర్పించారు. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లయ్యిందని.. న్యాయం కోసం తాను పోరాడుతూనే ఉన్నానన్నారు. తన తండ్రి హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట హాయిగా తిరుగుతున్నారని.. ఈ కేసు విచారణ సరిగా జరగడం లేదని.. అసలు న్యాయం జరుగుతుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య గురించి ఎంతో పోరాడినా న్యాయం జరగడం లేదన్నారు.
తన తండ్రి హత్య కేసులో నిందితుల కంటే తమకు , తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు వైఎస్ సునీతారెడ్డి. సీబీఐ అధికారులు మళ్లీ విచారణ ప్రారంభించాలని భావిస్తున్నానని.. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని.. సాక్షులపై కొందరు ఒత్తిడి తెస్తున్నారని వ్యాఖ్యానించారు. 'సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా కొందరు మేనేజ్ చేస్తున్నారనే అనుమానం ఉందని.. సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని నిందితుల్లో కొందరు బెదిరిస్తున్నారని అన్నారు. తన తండ్రి హత్య కేసులో కొంతకాలంగా వరుసగా సాక్షుల మరణాలపై కూడా తమకు అనుమానం ఉందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు. పులివెందులలో వివేకా వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ సునీతతో పాటు అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు.
కడప జిల్లా పులివెందులలో 2019 మార్చి 15న తెల్లవారుజామున వైఎస్ వివేకా ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. ముందు గుండెపోటు అని రక్తపు వాంతులంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.. ఈ కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో ఇటీవల వివేకా హత్యకేసుకు లింక్ ఉన్నవాళ్లు, సాక్షులు వరుసగా చనిపోవడం కలకలం రేపింది. ఈ అంశంపై వైఎస్ సునీత రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యోదంతం వ్యవహారం ఎప్పుడు ముగుస్తుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos