ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇంట విషాదం.. ఆయన సతీమణి షెహనాజ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సతీమణి మరణవార్త తెలియడంతో మంత్రి ఫరూక్ హుటాహుటిన నంద్యాల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. షెహనాజ్ పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు.. అంత్యక్రియల్ని శనివారం నిర్వహించే అవకాశం ఉంది. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు. ఎన్‌ఎండీ ఫరూక్ సతీమణి మృతి పట్ల మంత్రి లోకేష్ సంతాపాన్ని తెలియజేశారు. షెహనాజ్ ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నానని అన్నారు. అలాగే మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మంత్రి ఫరూక్ అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో హాజరవుతున్నారు.. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఆయన నంద్యాల వెళ్లారు. అయితే సతీమణి మరణవార్తతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యుడుగా ఉన్న ఎన్ఎండి ఫరూక్ గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఈ స్థాయికి ఎదగటానికి భార్య సహకారం ఎంతో ఉందని బంధువులు పేర్కొన్నారు. ఆమెకు ఐదుగురు కుమారులతో పాటు కూతుర్లు కూడా ఉన్నారని తెలిపారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె కుటుంబసభ్యులకు బంధువులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos