ఏపీలో కలెక్టర్ల సమావేశం ఇవాళ అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఇందులో సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని ఆ దిశగా కీలక అడుగులు వేస్తామని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానమని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని, సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలన్నారు. తెలుగుదేశం పార్టీ నాలుగు వందలతో ప్రారంభించిన పింఛను ఇప్పుడు నాలుగు వేలు చేశామని తెలిపారు. ఇలా దేశంలో ఎక్కడా జరగలేదన్నారు.
దీపం పథకం క్రింద ఆడబిడ్డలకు ఒక సిలెండర్ ఉచితంగా ఇచ్చామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, చెత్త పన్ను రద్దు చేశామని చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ తొలి వారంలో మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తామని వెల్లడించారు. మెజారిటీ ఉద్యోగాలు తెలుగుదేశం పాలనలోనే ఇచ్చామని గుర్తుచేశారు. బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ ఇచ్చామని, చేనేతలకు జీఎస్టీ రద్దు చేశామని తెలిపారు. అందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరాలని, చివరి లబ్దిదారునికి కూడా సంక్షేమం అమలు జరగాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు నేషనల్ హైవేస్ కు 55 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని,75 వేల కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పనులని, తమకు సంబంధం లేదని కలెక్టర్లు అనుకోకూడదన్నారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos