ఏపీలోని కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తూ... రానురాను అసమ్మతి తీవ్రత పెరుగుతోంది. ఆమెకు ఒక రాజకీయ వ్యూహం అంటూ లేకుండా వ్యక్తిగత అజెండా ప్రాతిపదికన మాట్లాడుతూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు.
దీనికి వారు పలు కారణాలు చెబుతున్నారు. ఓ రాజకీయ ప్రత్యర్థి పార్టీ అధినాయకురాలిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయకుండా తోడబుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే దృష్టి సారించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న కూటమి పార్టీలపైన విమర్శలు చేయకుండా.. వ్యక్తిగత ద్వేషంతో పదేపదే ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ.. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా అన్ని విధాలుగా పోరాటాన్ని సాగిస్తుండగా ఏపీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, చంద్రబాబుపై విమర్శలు గుప్పించినప్పటికీ - అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి అంటూ జగన్‌ను సైతం సదరు వివాదంలోకి తీసుకురావడంరావడం పరిపాటి అయిందనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ గళం విప్పి షర్మిలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. ఓ జాతీయ పార్టీకి ఏపీలో నాయకత్వాన్ని వహిస్తున్న షర్మిల కుటుంబ వివాదాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను విమర్శిస్తుంటారు గానీ ఏపీలో మాత్రం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీని విమర్శించడం ఆశ్చర్యంగా ఉందని హర్ష కుమార్ విమర్శించారు. దీనివల్ల కాంగ్రెస్ పుంజుకోలేకపోతోందని, ఇలాంటి పరిస్థితి రావడం దౌర్భాగ్యమని ఆయన ఘాటుగా విమర్శించారు. షర్మిల తీరు పైన తొలినుంచి పార్టీ సీనియర్ నాయకులు మండి పడుతున్న క్రమంలో ఢిల్లీ కాంగ్రెస్ ... ఆమెపై చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos