వైసీపీ అభ్యర్థులపై సొంత పార్టీల నేతల అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. ఉత్తరాంధ్రలో అత్యధిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తులు వెలుగులోకి వస్తున్నాయి. అసమ్మతి నేతలు కొందరు రాజీనామాలు చేస్తుండగా... మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు పార్టీ అధిష్టానం ఎట్టకేలకు గాజువాక టికెట్టు కేటాయించింది. దీంతో అక్కడ అసమ్మతి సెగలు రేగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఇతర నేతలు  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అమర్నాథ్ తొలిసారిగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి కూడా వీరు హాజరు కాలేదు. అదే విధంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు కూడా అసమ్మతి సెగ తగిలింది. వాసుపల్లి అభ్యర్థిత్వాన్ని పలువురు కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు.  ఇక విశాఖ  ఉత్తర నియోజకవర్గంలో  ఏర్పడ్డ అసమ్మతిని తీర్చే పనిలో అధిష్టానం ఉంది. అదేవిధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా  ఆముదాలవలస నియోజకవర్గంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ పొందూరుకు చెందిన నేతలు వైసిపికి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా వైసీపీలో కూడా అసంతృప్తి సెగలు రేగుతూనే ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం వైసీపీ నేతలు ర్యాలీ చేసి పార్టీ నుంచి వైదొలగారు. వైసీపీలో జగన్ తో పాటు ఎమ్మెల్యేలు కూడా ఈ ఐదేళ్లలో సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు విలువ ఇవ్వలేదని. అందుకే ఆశావహులను పక్కనపెట్టి ఎక్కడైతే సిట్టింగులకు అవకాశం ఇచ్చారో అక్కడే ఎక్కువ వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఎన్నికల నాటికి సర్దుబాటు చేసుకోకపోతే.. మరింత గడ్డు పరిస్థితి ఎదురవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos