ఏపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరమైన వాటితో సహా పెండింగ్ సమస్యలపై చర్చలకు నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఈ రోజు చర్చల్లో డీఏలపై ఊరట లభించే అవకాశం ఉంది. అదే విధంగా పెండింగ్ సమస్యలపైనా స్పష్టతకు చాన్స్ కనిపిస్తోంది. సానుకూలతతో చర్చలు చేయాలని సీఎం ఆదేశించటంతో.. 14 ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఈ రోజు సాయంత్రం సీఎం డీఏ పైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
డీఏ సహా ఇతర ఆర్థికాంశాలపై ఉద్యోగ సంఘాలతో ఈ రోజు సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సీఎస్ విజయానంద్ చర్చిస్తారు. చర్చలకు రావాలని ఇప్పటికే 14 ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎస్ సమీక్షిస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు. ఉద్యోగుల బకాయిల వివరాల పైన ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది. కొత్త జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పైన అంచనాకు మరి కొంత సమయం పడుతుందని అధికారులు వివరించారు.
కాగా .. ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఆర్థికాంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్, సీఎస్ విజయానంద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలపైన సానుకూలతతో, వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్చలు జరపాలని, చర్చల సారాంశాన్ని తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగులతో భేటీ తరువాత మంత్రులు సీఎంతో సమావేశం కానున్నారు. ఈ భేటీ తరువాత డీఏల పైన సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో 2 డీఏలు చెల్లించాలని కోరుతున్నారు. దీంతో పాటు హెల్త్‌కార్డులు పెద్ద సమస్యగా మారాయి. ఇలా ఆర్థిక పరమైన, ఆర్థికేతర పెండింగ్ సమస్యలపై ఇవాళ శనివారం జరగబోయే భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos