మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డీఎస్సీ కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 90 నిమిషాలు ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలను గుర్తించేలా అభ్యర్థుల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఉంటుందన్నారు. ఈ నెల 6వ తేదీ అంటే రేపటి నుంచి 154 కేంద్రాల్లో జరుగనున్న మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. రోజుకు రెండు విడతలుగా ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఆగస్టు రెండో వారంలోగా టీచర్ల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అభ్యర్థులు తమ హాల్‌టికెట్లలో ఏమైన తప్పులు​ ఉంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే సరి చేయనున్నారు. తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, కులం తదితర వివరాలు తప్పుగా నమోదైతే దీనికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్‌ రోల్స్‌లో సరి చేస్తారు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోతే అభ్యర్థులు కేంద్రానికి రెండు ఫొటోలు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డుగా ఆధార్, ఓటరు ఐడీ, పాన్‌ కార్డులాంటివి చూపించాలి. హాల్‌టికెట్‌లో తప్పిదాలు లేకపోతే గుర్తింపు కార్డుల అవసరం ఉండదని అన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 3,35,401 మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటి వరకు 3.04 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోనివారి ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు. మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాతి రోజు ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇస్తారు. దరఖాస్తుల సమయంలోనే పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. కాగా.. 421 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా శాప్​ ఇచ్చే జాబితాతో పాఠశాల విద్యాశాఖ ఆ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ కోటా కింద పోటీ పరీక్ష ఉండదని అధికారులు వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos