ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. పల్నాడు జిల్లాలో ఇవాళ గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలు పైన 3.5 తీవ్రతగా నమోదయింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. తెల్లవారుజామున 2 గంటల 33 నిమిషాలకు ఈ భూకంపం ప్రకంపనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
ఈ భూకంప ప్రభావంతో వినుకొండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది. వినుకొండతో పాటు దర్శి చుట్టుపక్కల ప్రాంతాలలో భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే స్వల్ప ప్రకంపనలు రావడం వల్ల అక్కడ ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. అయితే రానున్న రోజులలో ఈ ప్రాంతంలో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక తాజాగా భూకంపం రావడంతో ఏపీకి భూకంపాల ముప్పు ఉందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భూకంపాల పరంగా తక్కువ నుంచి ఒక మోస్తరు ప్రమాద ప్రాంతం ఉందని పరిగణించబడింది. అయితే ఇది ప్రాణ నష్టం జరిగేంత తీవ్ర స్థాయిలో ఉండకపోవచ్చు అన్న అంచనా ఉంది.
భారతదేశంలో భూకంప జోన్లను విభజించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూకంప తీవ్రత దృష్ట్యా జోన్ 2 లోను, జోన్ 3 లోను ఉన్నట్టుగా పేర్కొంది. అంటే తక్కువ ప్రమాదం, ఒక మోస్తరు ప్రమాదం ఉన్న ప్రాంతాలుగా ఏపీని భూకంపం దృష్ట్యా విభజించినట్టు సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఏపీలో భూకంపాలు సహజంగా చాలా అరుదుగా వస్తాయి. కొన్ని ప్రాంతాలలోనే స్వల్ప ప్రకంపనలు అప్పుడప్పుడు నమోదవుతాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలలోనూ, రాయలసీమలోని కొన్ని భాగాలలోనూ స్వల్ప స్థాయిలో భూకంపాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. అయితే ఏపీకి ప్రస్తుతం భూకంపాలతో వచ్చే ప్రమాదమేమీ లేదని సిస్మాలజీ లెక్కలు చెబుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos