భూకంపం ఏపీని కుదిపేసింది. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. ప్రత్యేకించి- ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల్లో ఇవాళ భూ ప్రకంపనలు రికార్డయ్యాయి. జిల్లాలోని ముండ్లమూరుతో పాటు తుళ్లూరు మండలంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు, పోలవరం, పసుపుగల్లు, శంకరాపురం, మారెళ్ల, తూర్పుకంభంపాడు, వేంపాడులో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.
తాళ్లూరు మండలంలోని గంగవరం, రామభద్రాపురం, తాళ్లూరుతో పాటుగా ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. ఈ భూప్రకంపనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలో గతంలో కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలంలోని గ్రామాల్లోనే భూ ప్రకంపనలు వచ్చాయి. కాగా డిసెంబర్ 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే. తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయి. అప్పట్లో ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. అక్కడ కొద్దిసేపు భూప్రకంపనలతో జనాలు భయంతో పరుగులు తీశారు.
తెలంగాణకు సరిహద్దులో ఉన్న నందిగామ, జగ్గయ్యపేటతో పాటుగా విజయవాడ, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం, గుడివాడ, పెనుగంచిప్రోలు, తిరువూరు, వీరులపాడు మండలాల్లో ప్రకంపనలు ప్రభావం కనిపించింది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. అప్పట్లో అంటే డిసెంబర్ 4న సంభవించిన భూ ప్రకంపనలకు తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రమని గుర్తించారు. ఈ మేరకు భూ కంప కేంద్రంలో.. భూమి అడుగు భాగం నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలను గుర్తించారు.. ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదైంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos