ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈసారి ఎలా ఉండబోతున్నాయనే దానిపై రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని తెలుగు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప గడపలో ఆ పార్టీ ఎలాంటి ఫలితాలు దక్కించుకుంటుందనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అనే స్లోగన్ తో ఊరూరా తన ప్రచారంలో ఊదరగొట్టిన  జగన్మోహన్ రెడ్డి ... ఇప్పుడు స్వరం మార్చుకుని గత ఎన్నికల కంటే ఎక్కువ గెలుస్తామని సవరణ ప్రకటన చేశారు. దీన్నిబట్టి చూస్తే... ఈసారి వైసీపి ఓటమి తధ్యం అని... అది కూడా… వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన కడప నుంచే మొదలయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కడప జిల్లాలో వైసీపి ఓడిపోతే ఆ క్రెడిట్లో సింహభాగం వైఎస్ షర్మిలకే దక్కుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రెడిట్ ఆమె ఒక్కరికే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆమెను గెలిపించమని ప్రజలను కోరినందుకు విజయమ్మకి, ఆమెకు మద్దతుగా అవినాష్ రెడ్డితో పెద్ద యుద్ధమే చేసిన సునీత రెడ్డికి, వారికి ఈ అవకాశం కల్పించిన అవినాష్ రెడ్డికి, జగన్మోహన్‌ రెడ్డికి కూడా క్రెడిట్ తప్పక లభిస్తుంది. కడప జిల్లాలో కడప, కమలాపురం, రాజంపేట, జమ్మలమడుగు, రాయచోటి, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలలో వైసీపి-కూటమికి మద్య హోరాహోరీగా పోటీ జరిగింది. పులివెందుల, బద్వేల్ నియోజకవర్గాలలో మాత్రం వైసీపికి ఏకపక్షంగా జరిగినట్లు తెలుస్తోంది. కడప కంచుకోటలో వైసీపికి ఎదురుగాలి ఎందుకు వీస్తోందంటే... దీనికి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో కారణం కనిపిస్తోంది. ఉదాహరణకు జగన్‌కు అత్యంత సన్నిహితుడు అంజాద్ బాషా, ఆయన తమ్ముడు, వారి అనుచరులు గత 5 ఏళ్లుగా కడపలో హిందువుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇంకా పేట్రేగిపోయారు. అయినా జగన్‌ అంజాద్ బాషాకే టికెట్‌ ఇచ్చారు. ఒకవేళ బాషా ఏమైనా తప్పులు చేసి ఉంటే తన మొహం చూసి పెద్ద మనసుతో మన్నించి ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని జగన్‌ కోరారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ఇది ఒక నియోజకవర్గంలో ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ చాలా చాలా కారణాలు ఉన్నాయి. అందువల్ల ఈసారి వైసీపి ఓటమి కడప గడప నుంచే మొదలవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Related Videos