చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాలు భారత భూభాగంవైపు వేగంగా కదులుతున్నాయి. మరో 3-4 రోజుల్లోనే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఇవి దక్షిణ అరేబియా సముద్రంలోని మాల్దీవుల వరకూ విస్తరించాయని ఐఎండీ స్పష్టం చేస్తోంది. ఇవి మరింత వేగంగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నట్టు ఐఎండీ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తర కర్ణాటక, గోవా మీదుగా కోస్తాంధ్ర వరకూ ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబందంగా ఇదే ప్రాంతంపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని అమరావతిలోని వాతావరణ విభాగం తెలియచేసింది. ఏపీతో పాటు దక్షిణ తెలంగాణ వరకూ మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలియచేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపై దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ విభాగం తెలియచేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే సూచన ఉన్నట్టు తెలియచేసింది. చాలాచోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకోవడంతో బ్యారేజీ జలకళ సంతరించుకుంది. ఇన్ ఫ్లో 17 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 17 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అలాగే జిల్లా వాసుల తాగునీటి కోసం కేసీ.కెనాల్ కాలువకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 1.15 టీఎంసీలుగా ఉందని అధికారులు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos