కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరిగింది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో కొందరు ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలిని పోలీసు అధికారులు పరిశీలించారు. ఈ ప్రమాదం పైన విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసారు.
ఈ ప్రమాదంపై డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించి పలు వివరాలను వెల్లడించారు. బస్సులో 38 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇప్పటివరకు 19 మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం బస్సు ప్రధాన డ్రైవర్ పరారీలో ఉన్నాడని, మరొక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఐజీ తెలిపారు. బైక్‌ను ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాద పరిణామాలను అంచనా వేసి, స్థానిక అధికారులు, వైద్యులు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు డీఐజీ తెలిపారు.
బస్సు ప్రమాద స్థలాన్ని కలెక్టర్ సిరి పరిశీలించారు. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో బస్సులోని ఓ కేబుల్ తెగిపోయిందని, అనంతరం మంటలు చెలరేగాయని కలెక్టర్ చెప్పారు. మంటలతో బస్సులో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయని పేర్కొన్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు.. కలెక్టరేట్‌లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రి: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061, కర్నూలు పోలీసు స్టేషన్: 91211 01075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో: 94946 09814, 90529 51010. ఏవైనా సమస్యల ఉంటే కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టర్ సిరి కోరారు. కాగా ఈ బస్సుకు ఇన్సూరెన్స్ తో సహా అన్ని రకాల అనుమతుల గడువు ముగిసినట్లు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos