ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు ఆర్బీఐ - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభమైంది. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్ భవన్‌లోకార్యాలయాన్ని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ ప్రారంభించారు. ఈ ఆర్బీఐ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ అట్టా ఒమర్ బషీర్ నేతృత్వంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయం ఏపీకి సంబంధించిన కరెన్సీ నిర్వహణ కొనసాగుతుంది.
విజయవాడలో ఏర్పాటైన కార్యాలయం నుంచి.. ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్, ఆడిట్ బడ్జెట్ అండ్ కంట్రోల్ సెల్, సెంట్రలైజ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాలు పని చేస్తాయి. ఈ మేరకు విభాగాల వారీగా కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించారు. మరోవైపు రెండస్తుల్లో ఉన్న ఈ ఆర్బీఐ కార్యాలయంలో ఉన్న ఛాంబర్లకు వినూత్నంగా.. రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల పేర్లను పెట్టారు. ఒక ఛాంబర్‌కు గోదావరి, మరో ఛాంబర్‌కు తుంగభద్ర పేరు పెట్టారు. అలాగే అత్యాధునిక సమావేశ మందిరాన్ని కూడా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. గత 11 ఏళ్లుగా ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు అంశంపై సందిగ్థత కొనసాగుతోంది. ఈ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియక గందరగోళం కొనసాగింది. చివరికి విజయవాడలో ఏర్పాటు చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కొత్తగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ఈ మేరకు ఆర్బీఐ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించింది. గతంలో ఈ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని.. అమరావతిలో కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీఐను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి.. అయితే దీనిపై క్లారిటీ రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు తెరపైకి రాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో, ఆర్బీఐతో సంప్రదింపులు జరిపారు. చివరికి విజయవాడలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos