ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ రాజకీయంగా తన రూటు మార్చారు. ఎన్నికల్లో ఓటమి తరువాత గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ, వ్యవహార శైలిలో దిద్దుబాటు ప్రారంభించారు. జగన్ లో వచ్చిన మార్పు.. తాజా ప్రకటనల పైన రాజకీయంగా చర్చ మొదలైంది. ఈ నిర్ణయాలు జగన్ కు కలిసి వస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల్లో పరాజయం తరువాత అధికారంలో ఉన్న సమయంలో చేసిన పొరపాట్లు ఎంత భారీ నష్టం చేసాయో జగన్ గుర్తించారు. పార్టీ నేతలతో వరుస సమీక్షల్లో అనేక అంశాలు బయటకు వచ్చాయి. దీంతో జగన్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలకు సమయం కేటాయిస్తున్నారు. పార్టీ ప్రక్షాళన ప్రారంభించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజల మధ్యకు వెళ్తూ సీఎం కాకముందు జగన్ ఎలా ఉండేవారో..అదే రీతిన ఇప్పుడు కనిపించే ప్రయత్నం చేస్తూ తాను మారాననే సంకేతాలు ఇస్తున్నారు.
జగన్ తాజా పర్యటనల సమయంలోనే బాధిత కుటుంబాలకు వరుసగా ఆర్దిక పరంగా పార్టీ తరపున సాయం ప్రకటిస్తున్నారు. గతంలో ఈ తరహాలో ఎప్పుడూ జగన్ ప్రకటనలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన దాడులు, అత్యాచార బాధిత కుటుంబాలకు రూ 10 లక్షల చొప్పున తమ పార్టీ నుంచి ఆర్దిక సాయం చేస్తామని జగన్ ప్రకటన చేసారు.
తాజాగా విజయనగరం జిల్లాలో డయేరియా కారణంగా మరణించిన కుటుంబాలకు .. జగన్ తన పార్టీ నుంచి రూ రెండు లక్షల చొప్పున సాయం ప్రకటించారు. జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు.. చేస్తున్న ఈ సాయం రాజకీయంగా కలిసి వస్తుందో లేదో కానీ... ఆయన మాత్రం ఆర్థిక సాయం ప్రకటించే విషయంలో దూసుకుపోతున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos