ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇవాళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు గతంలో రాజధాని కోసం తమ భూములిచ్చిన క్రమంలో వారికి ప్రతిఫలంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇచ్చేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వారికి రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నారు. అయితే ఇందులో పెట్టిన ఓ క్లాజ్ కారణంగా వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల వినతి మేరకు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయేకు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ లలో అసైన్డ్ అని ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది. ఇలా అసైన్డ్ అని ఉండటంతో తమ ప్లాట్ లు అమ్ముడు పోవడం లేదని ప్రభుత్వానికి రైతులు మొరపెట్టుకున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారుల అభిప్రాయం తీసుకుంది. చివరికి అమరావతి కోసం అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇవాళ ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్ ను మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో నంబర్ 187ను విడుదల చేశారు.
దీంతో అసైన్డ్ భూముల రైతులు కూడా తమ ఫ్లాట్లను ఇతరులకు అమ్ముకునేందుకు వీలు కలిగింది. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో తమకు కేటాయించిన ఫ్లాట్లను చూపించడం లేదని కొందరు, రిజిస్ట్రేషన్లు చేయించడం లేదని మరికొందరు, అన్నీ ఉన్నా చిన్న చిన్న సమస్యలతో ఫ్లాట్లు అమ్ముకోలేకపోతున్నామని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కో సమస్యనూ క్లియర్ చేస్తూ వస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos