ఏపీలో వాలంటీర్ల సేవలు కొనసాగుతాయా లేదా అనే అనుమానాలు రేకెత్తేవిధంగా... అసెంబ్లీలో ప్రభుత్వం ఆలోచన చేస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి అయిదు నెలలు పూర్తయింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ 10 వేలు వేతనం ఇస్తామని.. వారి సేవలు కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ, ఈ అయిదు నెలల కాలంలో వారి సేవలు వినియోగించుకోలేదు. వేతనం ఇవ్వలేదు. తాజా బడ్జెట్ లో ప్రభుత్వం చేసిన వాలంటీర్ల ప్రస్తావన... ప్రతిపాదించిన లెక్కల పైనే చర్చ మొదలైంది.
వాలంటీర్ల కు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వినియోగించుకుంటామని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతూ వచ్చారు. కానీ, గత ప్రభుత్వంలో ప్రతీ నెలా వాలంటీర్ల ద్వారా అందించే పెన్షన్లను తాజా ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తోంది. తాజాగా కుటుంబ సర్వే విషయంలో నూ సచివాలయ సిబ్బందితోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వారికి అవకాశం ఇవ్వకపోయినా.. కొనసాగుతున్న వారిని కంటిన్యూ చేస్తారని భావించారు. కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీంతో, వాలంటీర్లు కొద్ది రోజులుగా నిరసనకు దిగుతున్నారు. తమకు తిరిగి విధుల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో కొందరి వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నారు. ఆ తరువాత వారికి విధులు కేటాయించలేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వాలంటీర్ల విద్యార్హతలు, వారి సేవల పైన చర్చ కు వచ్చినా నిర్ణయం మాత్రం జరగలేదు. ఇక.. ప్రభుత్వం తాజాగా వచ్చే నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అందులో గ్రామ వాలంటీర్ల కోసం రూ 194.69 కోట్లు, వార్డు వాలంటీర్ల కోసం రూ 82.51 కోట్లు కేటాయించింది. అయితే, ఈ నిధులు గతంలో ఓట్ ఆన్ ఎకౌంట్ లో ప్రతిపాదించి ఏప్రిల్, మే నెలలో చెల్లించినవిగా చెబుతున్నారు.
వాలంటీర్లకు ఇప్పటికే అయిదు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా వచ్చే అయిదు నెలలకు కేటాయింపులు లేవు. విధులు కేటాయించక పోవటంతో వేతనాలు గడిచిన అయిదు నెలల బకాయిలు ఇవ్వటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే విధంగా.. వచ్చే అయిదు నెలల కాలానికి నిధులు ప్రతిపాదించకపోవటంతో.. వచ్చే మార్చి వరకు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సచివాలయాలను సైతం గ్రామ పంచాయితీ పరిధిలోకి తీసుకొచ్చి.. సిబ్బంది సర్దుబాటు పైన కసరత్తు జరుగుతోంది. ఇవన్నీ పూర్తయిన తరువాతనే ఏ సంఖ్య మేరకు వాలంటీర్లు అవసరం.. ఏ సేవలకు వినియోగించుకోవాలి అనే అంశం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos