ఏపీలో వైసీపీ హయాంలో విపక్ష నేతలపై ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన ఆ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలపై కూటమి సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటూ చంద్రబాబు, పవన్, వంగలపూడి అనిత, లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యుల్ని సైతం టార్గెట్ చేస్తూ రెచ్చిపోయిన పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ఇప్పటికే అరెస్టులు చేసిన ప్రభుత్వం త్వరలో మరిన్ని అరెస్టులకు రంగం సిద్దం చేస్తోంది.
తాజాగా రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులను సవాల్ చేస్తూ అధికార భాషాసంఘం మాజీ అధ్యక్షుడు విజయ బాబు హైకోర్టులో దాఖలు చేసిన పిల్ పై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో జడ్జిలను సైతం సోషల్ పోస్టుల్లో టార్గెట్ చేశారని, ఇలాంటి వారిని వదిలేయమంటారా అని ప్రశ్నించింది. అరెస్టులను సమర్థిస్తూనే వీటిపై అభ్యంతరం ఉంటే విడిగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దూకుడు పెంచబోతోంది.
తాజాగా వైసీపీ నేతలు శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళితో పాటు ఆ పార్టీ సానుభూతిపరుడైన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా ఫిర్యాదులు చేయిస్తున్న కూటమి సర్కార్ వాటి ఆధారంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేసేందుకు సిద్దమవుతోంది. వీరితో పాటు హైకోర్టులో అందించిన వివరాల ప్రకారం దాదాపు 2 వేల మందిని ఇలాంటి పోస్టులు పెట్టిన వ్యవహారంలో గుర్తించినట్లు తెలుస్తోంది. హైకోర్టు తాజా కామెంట్స్ నేపథ్యంలో వీరిపై వరుసగా చర్యలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి పోలీసులు మరింత దూకుడుగా ముందుకు వెళ్తారని చెబుతున్నారు. ప్రభుత్వ చర్యలపై వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos