అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ ప్రారంభం కానుంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తామని విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ తెలిపారు. శాసనసభలో ఈ మేరకు బిల్లు ప్రవేశ పెట్టారు. పరిశోధనల ప్రోత్సాహానికి ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు ప్రవేశ పెట్టారు. అదేవిధంగా నవంబర్ 26న బాలల అసెంబ్లీ నిర్వహణకు సభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యక్తిగతంగా ప్రయత్నించి ఏపీకి ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిని (IIULER) మంజూరు చేయించారని నారా లోకేష్ తెలిపారు. శాసనసభ తరపున గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటుచేయాలని నిర్ణయించామని, దీనికి అనుబంధంగా అసోసియేట్ ఇనిస్టిట్యూషన్స్ ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్, కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, జ్యుడీషియల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నారా లోకేష్ చెప్పారు. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి, ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లులను మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అడ్మిషన్లను కూడా 2025-26 లో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో 20శాతం స్థానికులకే ఇవ్వాలని బిల్లులో పొందుపర్చామని, కేవలం లీగల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా పీజీ, పీహెచ్డీ వంటి పరిశోధనలకు కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు.
ఈ యూనివర్సిటీకి అమరావతిలో 55ఎకరాలను చదరపు మీటర్ రూపాయి లీజు చొప్పున కేటాయించామని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ యూనివర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇందులో రాష్ట్ర కోటా 20శాతం ఉంటుంది. అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వచ్చినపుడు పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉంది. అందుకు అద్భుతమైన ఉదాహరణ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB). మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లాల్సిన ఐఎస్బీ ని సీఎం చంద్రబాబునాయుడు పోటీపడి ఆనాడు హైదరాబాద్ కు తీసుకెళ్లారు. దానివల్ల హైదరాబాద్ లో ఆ ప్రాంత రూపురేఖలు మారాయని మంత్రి లోకేష్ చెప్పారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లులను కూడా మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతిఏటా డిఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos