ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు దసరా పండుగకు మరో శుభవార్తను అందిస్తోంది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. విజయదశమి నాటికి గృహప్రవేశాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గృహనిర్మాణ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
దసరా కానుకగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం పనులు చేయిస్తోంది. సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్దిదారులకు అప్పగించేలా కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే మార్చికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రభుత్వం ఎస్సీ, బీసీ వర్గాలకు 50వేల రూపాయలు, ఎస్టీ వర్గానికి 75వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించి, వీరి గృహ నిర్మాణాలకు బాసటగా నిలిచింది. ఈ మద్దతుతో అనేక మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లారు. ఈ గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది .దీని ద్వారా లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది.
ప్రస్తుతం రూఫ్ కాస్ట్, లెంటల్ లెవెల్, రూమ్ లెవెల్ దశల్లో ఉన్న ఇల్లు త్వరగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇళ్ల స్థలం లేని వారికి పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్ల భూమిని కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గృహ నిర్మాణాలు జరుగుతున్న వారితో దసరా పండుగ నాటికి గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి దసరా పండుగ నాటికి ఎన్ని ఇళ్ళు పూర్తవుతాయి.. ఎంతమందితో ప్రభుత్వం గృహ ప్రవేశాలు చేయించగలుగుతుందనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పేదల జీవితాల్లో సంతోషం కోసం ఏపీ సర్కార్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos