కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గ సహచరులు ప్రమాణం చేశారు. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
జమ్మూ కాశ్మీర్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హర్యానాలో గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పంచ్‌కులా దసరా గ్రౌండ్స్ సెక్టార్ 5లో ఈ కార్యక్రమం ఏర్పాటుకానుంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుందిక్కడ. 90 నియోజకవర్గాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సొంతంగా సాధించింది. 48 స్థానాలతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.
ఈ ఎన్నికల్లో 35 నియోజకవర్గాలకే పరిమితమైంది కాంగ్రెస్. నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీకి చెందిన మఖ్యమంత్రులందరూ హాజరు కానున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, మోహన్ యాదవ్, భజన్‌లాల్ శర్మ, విష్ణుదేవ్ సాయ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మల సీతారామన్.. వంటి పలువురు ప్రముఖులు సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత అయిన ఏపీ సీఎం చంద్రబాబు, జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్‌కూ ఆహ్వానాలు అందాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సైని ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు వెళ్తారని చెబుతున్నారు. మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులనూ కలుస్తారని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos