ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన తరువాత.. అప్పటినుంచి ఆ పార్టీ పరిస్థితి నానాటికీ అద్వానస్థితికి చేరుకుంటోంది. అధికారంలో లేకపోయినా సరే కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతల పోరు ఆ పార్టీ అధినేతను కలవరపెడుతోంది. పార్టీని బలోపేతం చేయాలని వైయస్ జగన్ భావిస్తుంటే .. మరొకవైపు పార్టీ నేతలు మాత్రం వెనక్కు లాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా సుమారు మూడున్నర ఏళ్లు సమయం ఉన్నా.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే పార్టీలోని గ్రూపుల మధ్య పోరు తీవ్రమయింది. మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక రెండు వర్గాలుగా విడిపోయి పార్టీలో రచ్చ రచ్చ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇప్పటినుంచే ఆధిపత్య పోరు ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బుట్టా రేణుక వైసీపీ నుంచి పోటీ చేసీ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా బుట్టా రేణుక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు.
అయితే మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాత్రం తమ వర్గం బుట్టా కు మద్దతివ్వమని తెగేసి చెప్పడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ .. బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ ఛార్జిగా రాజీవ్ రెడ్డిని నియమించారు. కానీ ఈ నియామకాలు కూడా ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పడకపోగా ఇంకా ముదిరాయి. ఈ రెండు వర్గాలు వేర్వేరుగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. ఈ పరిణామం పార్టీ కార్యకర్తలకు, నేతలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ సలహా మేరకు కర్నూలు, నంద్యాల జిల్లా నేతలు ఎస్వీ మోహన్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డిలు రెండు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నం చేశారు కానీ పెద్దగా సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు.
బుట్టా రేణుక ఎమ్మిగనూరు నుంచి వెళ్లిపోవడానికి ఇష్టపడటం లేదు. అక్కడ తన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ ఉండటంతో ఈసారి శాసనసభలో అడుగు పెట్టాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే రాజీవ్ రెడ్డి కూడా తన తండ్రి చెన్న కేశవ రెడ్డి లెగసీని రాజకీయంగా అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రం కావడంతో కార్యకర్తలతో పాటు పార్టీ నాయకత్వానికి కూడా ఇది కాస్త తలనొప్పి వ్యవహారంగా మారింది. సెకండ్ లెవెల్ క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది. ఇక నేరుగా జగన్ జోక్యం చేసుకుంటే తప్ప ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ జోక్యం చేసుకుంటారా.. విభేదాలను పరిష్కరిస్తారా అన్నది చూడాలి మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos