ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ విధానాన్ని మాజీ సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు. తమ హయాంలో 16 మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చామని ... ఆరు కాలేజీ లను వివిధ దశల్లో పూర్తి చేసామని గుర్తు చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేసే ఆలోచనలను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు టెండర్లు పిలిచి.. ఎవరికి అప్పగించినా తామ అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయటం లేదని.. పీపీపీ విధానంలో 2028 నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేస్తోంది.
కాగా, ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీల నిర్వహణ పైన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో.. ఇప్పుడు జగన్ ఈ అంశం పైన పోరాటానికి సిద్దం అవుతున్నారు. అటు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటంతో అనర్హత అంశం పైన అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల విషయంలోనూ జగన్ సీరియస్ గా ఉన్నారు. అనర్హత వేటుకు సిద్దం అయితే.. ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలతోనూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 24 జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశం పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజీనామాలు చివరి అస్త్రంగా ఉండాలని.. ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర స్థాయిలో నిరసనలు తీవ్రతరం చేయాలని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయ పడుతున్నారు.
జగన్ ఈ సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో దసరా తరువాత రాష్ట్ర స్థాయి నిరసన దీక్షకు జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నంద్యాల లేదా విజయవాడ కేంద్రంగా నిరహార దీక్ష చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వరుస నిరసనల తరువాత ప్రభుత్వ ఆలోచన మారకుంటే రాజీనామాలు చేయాలని జగన్ ప్లాన్ గా పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఈ నెల 24న జరిగే సమావేశంలో జగన్ ఈ అంశం పైన పోరుబాట... దీక్ష.. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ తొలి నిరసన పోరులో స్వయంగా పాల్గొనాలని నిర్ణయించటంతో... ఇప్పుడు ఈ వ్యవహారం ద్వారా ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos