ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదుపు తప్పిన పాలనను దారిలో పెట్టేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఎలాంటి లోపాలు లేకున్నా .. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశాన్నీ భూతద్దంలో చూస్తూ నానా హంగామా చేసేందుకు ఆరాటపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత... కాస్త సిగ్గుపడే రాజకీయ నాయకుడు అయితే సైలెంటుగా గా ఉంటారు. కానీ సిగ్గుపడితే రాజకీయాల్లో పైకి రాలేమని జగన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ఏ మాత్రం అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా తాను ఐదేళ్లలో చేసిన నిర్వాకాల పాపాలను ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో కడగలేకపోయిందని పోరుబాట పడుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేయడం లేదని.. ఈ విషయంపై రోడ్డెక్కుతామని జగన్మోహన్ రెడ్డి నిర్లజ్జగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కాలేజీలకు ఉన్న బకాయిలన్నీ గత విద్యాసంవత్సరానికి చెందినవేనని అందరికీ తెలుసునని, ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ ఇప్పుడు పోరాటాలంటూ హడావుడి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ తన హయాంలో ఇదిగో ఇస్తున్నాం అని బటన్లు నొక్కి .. అందు కోసం ప్రకటనలు ఇచ్చి వందల కోట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు కానీ ఆ నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఇలా మొత్తం మూడు త్రైమాసికాలు ఆపేశారు. ఇప్పుడు ఆ డబ్బులే కాలేజీలు అడుగుతున్నాయి. కాలేజీలను ఈ పథకం నుంచి జగన్ రెడ్డి ఎప్పుడో తప్పించారు. తల్లులను చేర్చారు. ఇప్పుడు వారికి తానివ్వాల్సినవి ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదని రోడ్డెక్కుతారట. ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్స్ ను మార్చింది. మళ్లీ కాలేజీల ఖాతాలకు ఇస్తోంది. అందుకే అర్హులైన విద్యార్థులందరూ రూపాయి కట్టకుండా కాలేజీల్లో చేరిపోయారు.
అలాగే కరెంట్ చార్జీల అంశాన్ని కూడా జగన్... ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి చుట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసిన కమిషన్ల దందాతో పెద్ద ఎత్తున ప్రజలపై భారం మోపారు. తాను సీఎం గా ఉన్నప్పుడే అదనపు చార్జీల అమలుకు ఏపీఈఆర్సీ నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇప్పుడు అవి అమల్లోకి వస్తే.. మీరు ఆపాలంటూ రోడ్డెక్కుతున్నారు. జగన్ రెడ్డి నిర్వాకాలను చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos