మాజీ సీఎం జగన్ అనకాపల్లి పర్యటన పైన వివాదం కొనసాగుతోంది. జగన్ విమానాశ్రయం నుంచి అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం మెడికల్ కాలేజ్ వరకు రోడ్ షో చేసేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేసారు. అయితే ఇంతదూరం రోడ్ షో చేసేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసారు. నేరుగా మకవరపాలెంకు హెలికాఫ్టర్ వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు తాజాగా జగన్ రోడ్ షోకు షరతులతో అనుమతి ఇచ్చారు.
జగన్ ఈ నెల 9న మాకవరపాలెంలో మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. జగన్ పర్యటన వేళ భద్రత కల్పించాలని జిల్లా వైసీపీ నేతలు పోలీసులకు లేఖ ఇచ్చారు. కాగా.. విశాఖలో మహిళల క్రికెట్ మ్యాచ్ తో పాటుగా.. విమానాశ్రయం నుంచి మాకవరపాలెం వరకు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల మీదుగా రోడ్ షో కు అంత దూరం అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. కరూర్ లో హీరో విజయ్ సభ సమయంలో చోటు చేసుకున్న ఘటనను ప్రస్తావించారు. అయితే, అటు వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన కొనసాగి తీరుతుందని చెప్పుకొచ్చారు. ఈ సమయం లోనే పోలీసులు జగన్ రోడ్ షోకు షరతులతో అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా, అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా, మాకవరపాలెంకి అనుమతి ఇచ్చారు పోలీసులు. రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా జగన్ వాహన శ్రేణిలో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతిని రద్దు చేయడమే కాకుండా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదైనా గాయం, ప్రాణ నష్టం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి జరిగే నష్టానికి నిర్వాహకుడు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాలని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్, అనకాపల్లి ఎస్పీ స్పష్టం చేసారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos