ఏపీలో ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తాజాగా లిక్కర్ స్కాంలో  వరుస అరెస్టులపై ఆయన ఇవాళ స్పందించారు. గతంలో జగన్ చేసిన తప్పేమిటో ఆయన రెండు ముక్కల్లో చెప్పేశారు. జగన్ మంచితనం కారణంగానే తాము అధికారాన్ని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మనం మంచి చేశాం.. పైన దేవుడు ఉన్నాడు.. కింద ప్రజలున్నారని జగన్ చెప్పాడు. కానీ.. మధ్యలో మోసకారి చంద్రబాబు ఉన్నాడని తెలుసుకోలేకపోయాడన్నారు. చంద్రబాబు కుయుక్తుల్ని అర్దం చేసుకోవడంలో జగన్ వైఫల్యం వల్లే తాము సంకనాకిపోయామంటూ రాచమల్లు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పవర్ కోసం, డబ్బు కోసం ప్రాకులాడి ఉండి ఉంటే.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేదన్నారు. వైసీపీ హయాంలో మద్యం స్కాం పేరుతో రిటైర్డ్ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి అరెస్ట్ కుట్ర‌పూరితమని రాచమల్లు ఆరోపించారు. వైయ‌స్ జ‌గ‌న్ కి అండ‌గా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారని, రాష్ట్రంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల‌కు ర‌క్ష‌ణ‌ లేదని  విమర్శించారు. అక్ర‌మ కేసుల‌తో ఉన్న‌తాధికారుల‌ను వేధిస్తున్నారని, ఏపీలో ప‌నిచేయాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి తీసుకొచ్చారని రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ ద్వారా కోట్లాధి రూపాయలు అక్రమంగా అమరావతిలోని చంద్రబాబు కరకట్ట ప్యాలెస్‌కు చేరుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిఏటా నారావారి లిక్కర్ కమీషన్లు అక్షరాలా రూ.2,200 కోట్లు అన్నారు. డిస్టిలరీల నుంచి ఏడాదికి రూ.1000 కోట్లు సీఎం చంద్రబాబుకు, లిక్కర్ షాప్‌ల నుంచి ఆయన కుమారుడు నారా లోకేష్‌కు రూ.1200 కోట్లు ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. అయిదేళ్లలో ఏకంగా రూ.10వేల కోట్లకు పైగా లిక్కర్ ద్వారా దండుకుంటూ అతిపెద్ద స్కామ్‌ను నడిపిస్తున్న ఘనులు తండ్రీకొడుకులని పైర్ అయ్యారు.

ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో 40 మ‌ద్యం షాపులు, 10 బార్లుంటే, ప్ర‌తినెలా ఒక‌టో తారీఖున ప్ర‌తి మ‌ద్యం షాపు నుంచి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి రూ. 70 వేలు, పోలీస్ స్టేష‌న్‌కి రూ. 30 వేలు అందుతున్నాయ‌ని స్థానిక ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి స్వ‌యంగా వెల్లడించారని, దీని ప్రకారం క‌డ‌ప మొత్తంమీద 500 మద్యం షాపులుంటే రూ.5 కోట్లు చొప్ప‌న ప్ర‌తినెలా అమ‌రావ‌తికి మామూళ్ళు చేరుతున్నాయన్నారు. ఇలా ఒక్క జిల్లా నుంచే ప్రతినెలా రూ.5 కోట్లు ముడుపులుగా నారా వారికి చేరుతుంటే, మిగిలిన జిల్లాల నుంచి ఎంత వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ఆయన విమర్శించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related Videos