ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లడ్డూ వ్యవహారం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. రాజకీయ వివాదంగా మారింది. కూటమి - వైసీపీ మధ్య లడ్డూ వివాదం పైన కొద్ది రోజులుగా డైలాగ్ వార్ కొనసాగుతోంది. మండలిలోనూ వైసీపీ సభ్యులు ఇందాపూర్ వ్యవహారం పైన చర్చకు పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా లడ్డూ వివాదం పైన ప్రభుత్వం చర్చ ప్రారంభించింది. అయితే.. మాజీ సీఎం జగన్ తాజా నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
లడ్డూ వివాదం ఊహించని మలుపులు తీసుకుంటోంది. జగన్ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు సూచనల మేరకు సిట్ విచారణ చేసింది. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో అనేక అంశాలను ప్రస్తావన చేసింది. వైసీపీ.. జగన్ లక్ష్యంగా కూటమి నేతలు ఈ అంశంలో పలురకాల ఆరోపణలు చేసారు. ఇదే సమయంలో ఇందాపూర్ - హెరిటేజ్ అంశం పైన మండలిలో వైసీపీ సభ్యులు చర్చ కోసం డిమాండ్ చేస్తున్నారు. కాగా.. అసెంబ్లీలో ఈ రోజు మంగళవారం.. మండలిలో 26న చర్చ చేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కూటమి నేతలు చేసిన ఆరోపణల పైన మీడియా సమావేశంలో జగన్ స్పష్టత ఇచ్చారు. తిరుమలకు లడ్డూ సరఫరా, బోలే బాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యి.. ఇందాపూర్ వ్యవహారంతో పాటుగా వైఎస్సార్ హయాంలో తిరుమల కొండల పైన ఇచ్చిన జీవోలను బయట పెట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో తన ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. జగన్ ఇచ్చిన వివరణతో వైసీపీ నేతల్లో జోష్ పెరిగింది.
అయితే, ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో జగన్ హాజరు కాకపోవటం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సభా వేదికగా అధికారిక రికార్డుల్లో ప్రభుత్వం లడ్డూ వివాదం పైన చర్చ.. వివరణ ఇస్తోంది. జగన్ ఈ సమయంలో హాజరై తన వాదన వినిపించాల్సిన అవసరం ఉందని పార్టీలో కొందరు నేతలు భావిస్తున్నారు. జగన్ ఈ సమయం లోనూ హాజరు కాకపోవటం వల్ల కూటమి నేతల వాదన మాత్రమే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. జగన్ చెప్పాలనుకున్నది ఇప్పటికే చెప్పారని.. సభకు వచ్చినా మాట్లాడే అవకాశం ఉండదనేది మరో వాదన. అయితే, జగన్ సభకు వచ్చి మాట్లాడే అవకాశం లేకుంటే ఆ తరువాత మరోసారి మీడియా ముందు వివరించే అవకాశం ఉంటుందని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కీలక చర్చ సమయంలో జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వెళ్లటం ద్వారా.. కొత్త విమర్శలకు అవకాశం ఇవ్వటమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మండలిలో వైసీపీ నేతలు ఇందాపూర్ - హెరిటేజ్ అంశం పైన మాట్లాడుతారని చెబుతున్నారు. అయితే, జగన్ ఈ కీలక చర్చ సమయంలో సభకు రాకపోవటం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos