ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యంగా జగన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. నిరసనలకు సిద్దం అవుతున్నారు. తాజాగా పార్టీ కార్యకర్తలకు మద్దతుగా డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. ఇక.. జగన్ యూరప్ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. సీబీఐ కోర్టు సైతం అనుమతి ఇచ్చింది కానీ... ఇదే సమయంలో షరతులు విధించింది. వీటితో పాటుగా జగన్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
తమ కుమార్తెల వద్దకు వెళ్లేందుకు జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. జగన్ పిటీషన్ పైన విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు... అక్టోబరు 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొనగా... సీబీఐ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. జగన్ ఆర్దిక నేరాల కేసుల్లో నిందితుడుగా ఉన్నారని... విదేశీ పర్యటనలకు ఆయనను అనుమతించకూడదని తన వాదనలు వినిపించారు. పైగా... గతంలో విదేశీ పర్యటనలకు అనుమతించినప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో మినహా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదని చెప్పుకొచ్చారు.
జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లి తిరిగి వచ్చిన సమయంలో ఎప్పుడు వచ్చారో కూడా తెలియలేదని... దీంతో తగిన షరతులు విధించాలని కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం పలు షరతులతో జగన్ యూరప్ పర్యటనకు అనుమతించింది. ఆయన తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే... యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబరు 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని ఆదేశించింది. దీంతో.. జగన్ అక్టోబర్ తొలి వారంలోనే యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. 15 రోజుల పాటు వ్యక్తిగత పర్యటన కు వెళ్లి వచ్చిన తరువాత జిల్లాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో స్వయంగా హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక దీపావళి నుంచి జగన్ రాజకీయంగా దీక్షలు, పర్యటనల్లో పాల్గొంటారని వెల్లడించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos