ఏపీలో ఎస్సీ వర్గీకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడంతో పాటు దీనిపై నియమించిన ఏక సభ్య కమిషన్ రిపోర్టును కూడా ఆమోదించింది. దీనిపై మాల కులాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కూటమిలో భాగస్వాములైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు భిన్నంగా విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మౌనంగా ఉంటున్నారు. దీనిపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేయడంలో సీఎం చంద్రబాబుదే కీలకపాత్ర అని అన్నారు. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆయన తెలిపారు. 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి ఈ విజయం అంకితమని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు న్యాయంవైపే నిలబడ్డారని ప్రశంసించారు. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.

1997లో చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకుని తాను ఎస్సీ వర్గీకరణ కోసం పాదయాత్ర ప్రారంభించానని మందకృష్ణ గుర్తుచేసుకున్నారు. మోదీ, అమిత్‌షా, వెంకయ్య, కిషన్‌రెడ్డి తమకు అండగా నిలిచారన్నారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తుచేస్తూ పవన్ కల్యాణ్ కూడా మద్దతిచ్చారన్నారు. అదే సమయంలో జగన్ ఉంటే ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్లం కాదని మందకృష్ణ తెలిపారు. కనీసం వినతిపత్రం ఇచ్చేందుకూ జగన్ తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాన్ని వైసీపీ ఇంకా చెప్పలేదన్నారు

Related Videos