టీడీపీ మహానాడుకు రంగం సిద్దం అవుతోంది. మూడు రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా ఈ వేడుక నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తరువాత జరగుతున్న తొలి మహానాడు కావటంతో ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ సారి చేసే రాజకీయ తీర్మా నం కీలకంగా మారుతోంది. కాగా, ఈ సారి మహానాడు కు జూ ఎన్టీఆర్ ను పిలవాలనే నిర్ణయం పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

కడప జిల్లాలో మే27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక, మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన తరువాత జరుగుతున్న ఈ మహానాడులో నందమూరి హీరోలను భాగ స్వాములను చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు.. కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి నందమూరి బాలయ్య చొరవ తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

2009 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూ ఎన్టీఆర్ ప్రచారం చేసారు. ప్రచారం మధ్యలో ప్రమాదం కారణంగా నిలుపుదల చేసారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాలు.. మహానాడులోనూ పాల్గొన్నారు. ఇక, 2014 లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆ తరువాత.. క్రమేణా పార్టీ - కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాను సిద్దంగా ఉంటానంటూ ఇంటర్వ్యూల్లో తారక్ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు సైతం తారక్ తో సన్నిహితంగా ఉండటం.. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరి ణామాల పైన టీడీపీ అంచనాలను తగినట్లుగా తారక్ స్పందించకపోవటం పైన ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు జూ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.

కాగా, 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తరువాత చంద్రబాబు, పవన్, లోకేష్ కు తారక్ అభినందనలు చెప్పారు. తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు రావటం పైన జూ ఎన్టీఆర్ ను అందరూ అభినందించారు. ఇప్పుడు పవన్ తో పొత్తు ఉండటంతో జూ ఎన్టీఆర్ ను సైతం తమతోనే ఉన్నారనే సంకేతాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. తారక్ సైతం గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిసిన తరువాత అనేక ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తారక్ ను మహానాడుకు పిలవటం ద్వారా తాము జూ ఎన్టీఆర్ ను విస్మరించ లేదనే సంకేతాలు పంపించే ప్రయత్నం చేయాలని పార్టీ భావిస్తుంది. భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లోనూ తారక్ అవసరమని టీడీపీ అంచనా వేస్తోంది. తారక్ మహానాడుకు వస్తారా.. లేదా అన్నది ఇప్పుడు ఈ అంశం టీడీపీలో ఆసక్తి కర చర్చగా మారుతోంది.  ఏం జరుగుతుందో మరి చూడాలి.

Related Videos