ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటమి తప్పలేదు.. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పారు.. కూటమి పార్టీల్లో చేరిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలు, జెడ్పీలు, ఎంపీపీ పదవులు కూడా వైఎస్సార్‌సీపీకి చేజారిపోయాయి. ఈ పదవులు కూటమిలోని పార్టీల ఖాతాల్లోకి చేరిపోయాయి. వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా మరో మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ నుంచి చేజారిపోయింది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి టీడీపీ ఖాతాలోకి చేరింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన ఓటింగ్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఓటేశారు. కల్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు.. వీరిలో ఎక్కువ మంది టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలియజేయడంతో తలారి గౌతమి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు ఇటు శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ కూడా టీడీపీ కైవసం చేసుకుంది. రామగిరి ఎంపీపీగా కప్పాల సాయిలీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామగిరిలో 9 మంది ఎంపీటీసీలకు గాను నలుగురు హాజరయ్యారు.. దీంతో సాయిలీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మూడుసార్లు రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడగా (కోరం లేక).. నాలుగోసారి ఈ ఎన్నిక జరిగింది. రామగిరి ఎంపీపీ ఎన్నికను వైఎస్సార్‌సీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ తలారి రాజ్ కుమార్‌ను తొలగించిన క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తప్పలేదు.. మొత్తం 24 మంది కౌన్సిలర్లలో టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు ఉండగా.. వైఎస్సార్‌సీపీకి 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషీయో ఓటుతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. మొత్తం మీదు ఒకే రోజు వైఎస్సార్‌సీపీకి రెండు (కళ్యాణ దుర్గం, రామగిరి) చోట్ల ఎదురు దెబ్బలు తప్పలేదు. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉండటంతో స్థానికంగా 144 సెక్షన్ అమలు చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డు కౌన్సిలర్లు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంది. దీంతో ఎన్నికకు ఓటు హక్కు కలిగిన వారిని గుర్తింపు కార్డుతో వస్తే అనుమతించారు. అంతేకాదు మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో చేరడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos