సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా చెబుతున్న కసిరెడ్డి విచారణ సమయంలో అనేక విషయాలను వెల్లడించారు. కీలక అంశాలను బయట పెట్టారు. సిట్ అధికారుల విచారణ సమయంలో జగన్ ఆదేశించగా.. తాను ఆచరించినట్లు వివరించారు. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డితో కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునేలా కార్యాచరణ సిద్దం చేసామని చెప్పుకొచ్చారు. జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు పలువురికి ఇందులో పాత్ర ఉందని కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్లు 'సిట్' వెల్లడించింది.
రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో అనేక కీలక విషయాలు బయటపెట్టారు. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఆయనను ప్రశ్నించామని... నేరం, దాని వెనుక ఉన్న కుట్ర, తన పాత్ర, ఇతరుల భాగస్వామ్యంపై అన్ని అంశాలు అంగీకరించిన రాజ్ కసిరెడ్డి, చివరికి నేరాంగీకరపత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారని 'సిట్' పేర్కొంది. పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కవుట్ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్ నాకు అప్పగించారని కసిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని, పథకాల అమలుకూ ఆదాయం సమకూరాలని నిర్దేశించారు. దీంతో... బేవరేజెస్ కార్పొరేషనే లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించామని వెల్లడించారు.
మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన మా ప్లాన్‌ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్‌కు అప్పగించామని వివరించారు. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్‌లోని విజయసాయి రెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేసినట్లు అంగీకరించారు. మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారులనుంచి ముడుపులు వచ్చేలా ఫిక్స్ చేశామని చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ4 ఎంపీ మిథున్‌రెడ్డి, ఏ5గా విజయ సాయిరెడ్డిని పేర్కొనగా.. మొత్తం 29 మందిని నిందితులుగా చేర్చారు. జగన్ చెబితేనే తాను చేసానని కసిరెడ్డి చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నా.. నిందితుల జాబితాలో జగన్ ప్రస్తావన లేకపోవటంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కసిరెడ్డికి రిమాండ్ విధించటంతో పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos