టీడీపీ అధినేత చంద్రబాబు... నెమ్మదిగా ఒక్కోజిల్లా చొప్పున పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనేలా వారిని సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు ... ఈసారి కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త అభ్యర్థిని ప్రకటించి పార్టీ వర్గాల్లో సంచలనం రేకెత్తించారు. ఈ స్థానానికి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి పేరును వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుత ఇన్ ఛార్జి సుబ్బానాయుడిని తొలగించి కృష్ణారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. అనూహ్యంగా ... ఉన్నట్టుండి ఒక్కసారిగా తెరపైకి వచ్చిన ... దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి ఎవరు అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది. సాధారణ కాలేజీ లెక్చరర్ గా ప్రయాణాన్ని ప్రారంభించిన కావ్య కృష్ణారెడ్డి ... ఆ తరువాత కాలంలో గనుల బిజినెస్ చేపట్టి ప్రస్తుతం మైనింగ్ కింగ్ గా ఎదిగారు. నెల్లూరు జిల్లాలో క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి మైనింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఇలా అంచెలంచెలుగా వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ అధ్యాపకుడు కాస్త వేలకోట్ల అధిపతిగా మారారు. చాలారోజులుగా టీడీపీలో కొనసాగుతున్న ఆయన ఇప్పుడు కావలి సీటుపై కన్నేసి... ఇన్నాళ్లకు అనుకున్నది సాధించారు. టీడీపీ అధిష్టానాన్ని ఒప్పించి కావలి ఇన్ ఛార్జిగా నియమితులయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా మారడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కావ్య కృష్ణారెడ్డి. కాగా... కావలి నియోజకవర్గంలో చివరిసారిగా 2009లో టీడీపీ విజయం సాధించింది. 2014, 2019లో ఓటమి ఎదురైంది. ఈసారి టీడీపీ ఇన్ ఛార్జి నియామకం విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహరించి ఎట్టకేలకు కావ్య కృష్ణారెడ్డి వైపు మొగ్గు చూపింది. సో... రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఆయన పోటీ ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos