విజయవాడలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న కీలక నిందితుడు (ఏ2) కొమ్మా కొట్లు విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో సోమవారం లొంగిపోయాడు. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏ1 నిందితుడు కాగా, కొమ్మా కొట్లు ఏ2గా ఉన్నాడు. కేసులో మరికొందరు నిందితులు ఉన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా దళిత యువకుడు సత్యవర్థన్ ఉన్నాడు. అతడ్ని కిడ్నాప్ చేసి, మొదట హైదరాబాద్‌కు తరలించి, తరువాత తిరిగి విజయవాడకు తీసుకురావడంలో ఏ2 కొమ్మా కొట్లు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ కేసును ఉపసంహరించుకోవాలని వల్లభనేని వంశీ అనుచరులు సత్యవర్థన్‌పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. అందుకు అతడు నిరాకరించడంతో, చివరకు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు, తేలప్రోలు రాము, వజ్రకుమార్, ఇటీవల కోర్టులో లొంగిపోయారు. మరో కీలక నిందితుడు ఎర్రంశెట్టి రామాంజనేయులును విజయవాడ పటమట పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇటీవల కొమ్మా కొట్లుతో సహా మరికొందరు నిందితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపై ఇటీవల నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ క్రమంలో కొమ్మా కొట్లు పటమట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇదే కిడ్నాప్ కేసులో గతంలో వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ కావడం, అనారోగ్య కారణాలతో జైలులో ఇబ్బందులు ఎదుర్కొని, ఆ తర్వాత విడుదల కావడం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos