ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం వ్యవహారంలో పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఆయనకు నాలుగుసార్లు నోటీసులు ఇచ్చారు. కానీ హాజరు కాలేదు. దీంతో ఆయన కోసం పలు బృందాలు గాలిస్తున్నాయి. ఆయన పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఆజ్ఞాతంలోకి పోవడంతో అరెస్టు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో రాజ్ కసిరెడ్డినే కర్త, కర్మ, క్రియ అని వాంగ్మూలం ఇచ్చారు.
అరెస్టు నుంచి న్యాయపరమైన రక్షణ కోసమే ఇంతకాలం సీఐడీ ఎదుట హాజరు కాలేదని రాజ్ కసిరెడ్డి రెండు రోజుల కిందట ఓ ఆడియో విడుదల చేశారు. కొన్ని రోజుల నుంచి మీడియాలో తన గురించి తప్పుగా ప్రచారం జరుగుతోందన్నారు. మార్చి ఆఖరి వారంలో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చి మా మదర్‌కు నోటీసులు ఇచ్చారు. నన్ను విట్‌నెస్‌గా నోటీసు ఇచ్చి విచారణకు రావాలని చెప్పారు. నేను సహకరించడానికి సిద్ధమే. వస్తాను. కానీ నన్ను ఎందుకు పిలుస్తున్నారనే విషయం సమాచారం ఇవ్వండని అడిగాను. స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా అని కూడా అడిగాను. ఎవరైనా నా గురించి చెప్పిన సమాచారం ఏమైనా ఉందా అని కూడా ఆరా తీసానని తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాం... అన్నింటి కంటే ముఖ్యంగా నేను విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. న్యాయపోరాటం పూర్తి అయిన తర్వాత కచ్చితంగా నేను విచారణకు వస్తానని ఆయన తెలిపారు.
అయితే రాజ్ కసిరెడ్డి వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది కానీ వారం రోజులకు వాయిదా పడింది. దీంతో విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన విడుదల చేసిన ఈ ఆడియోలోనే విజయసాయిరెడ్డి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సాయి రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని, న్యాయపోరాటానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, విచారణ ఎదుర్కొన్న తర్వాత మీడియా ముందు ఆయన గురించి చెబుతానని, ఆయన చరిత్ర అంతా బయటపెడతానని రాజ్ కసిరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి . .. సాయిరెడ్డి గురించి ఏయే విషయాలు బయట పెడతారో అన్న ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos