తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గత జగన్ ప్రభుత్వానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. గుంటూరు తర్వాత ఇక ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు. జగన్ నిర్వహించిన గుంటూరు పర్యటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ టీడీపీ సారథ్యంలోని కూటమి నాయకులు ఊరూరా ఫ్లెక్సీలు వేయడం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు దాడులకు దారి తీశాయి. పెట్రోల్ బాంబులు విసురుకునేంత స్థాయికి చేరుకుందనేది తేటతెల్లమైంది. ఈ పరిణామాల మధ్య టీడీపీ కూటమి అధినేతలు నేడు సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్న జనసేన చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మాధవ్.. చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. తిరుమల లడ్డూ అంశాన్ని ఎలా తిప్పి కొట్టాలి, జగన్ దూకుడును ఎలా అడ్డుకోవాలనే విషయంపై చర్చించే అవకాశం ఉంది.
తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు, చేప నూనె కలిసిందంటూ స్వయానా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పలుమార్లు ప్రకటించారు. ఇందులో సాక్షాత్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. విచారణ జరిపించడానికి సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అన్ని కోణాల్లోనూ సూక్ష్మస్థాయిలో విచారణ జరిపిన అనంతరం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ కాలేదంటూ సిట్ నివేదిక ఇచ్చింది. దీన్ని ఎలా తిప్పి కొట్టాలనేది టీడీపీ కూటమికి సవాల్ గా మారింది. ప్రధానంగా తిరుమల లడ్డూ విషయంలో ప్రజల్లోకి మూడు పార్టీలు కలసి ప్రచారం చేపట్టడంపై ఇవాళ జరగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కూటమి పార్టీలు కలసి ఉన్నాయన్న భావన ప్రజల్లో కలిగించాలని, అలాగే తిరుమల లడ్డూ విషయంలో జరిగిన విషయాలను ప్రజలకు వివరించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలలో మూడు సభలు పెట్టడమా.. లేక జిల్లాల పర్యటన చేయడమా అన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై నేడు చర్చకు వచ్చే అవకాశముంది. దీంతో పాటు ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ముగ్గురు నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos