రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 15 బ్యాంకులు మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ హాజరయ్యారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా సుమారు 6,514 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఆర్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చారిత్రక కార్యక్రమంలో రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిలో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్న వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, నాబార్డ్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ వంటి ప్రముఖ జాతీయ సంస్థలు ఉన్నాయి. ఈ పరిణామంతో రాజధాని అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయని, మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారని" ఆయన ఆరోపించారు. ఒక్క వ్యక్తి కోసం రూ.450 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. రైతులు మాత్రం 'ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని' నినాదంతో పోరాడారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా 'జై అమరావతి' అంటూ ముందుకు సాగారని కొనియాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఈ రాజధానిని ఆపడం ఎవరి ఇంట్లో లైట్ స్విచ్ కాదని లోకేశ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తున్న సహకారానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆమె నిరాడంబరతకు హ్యాట్సాఫ్ చెబుతూ, మంగళగిరి చేనేత వస్త్రాలను ధరించి వాటికి ప్రచారం కల్పించారని ప్రశంసించారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవడంలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంలో ఆమె కీలక పాత్ర పోషించారని వివరించారు. రాజధానిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయనున్న ఈ 'బ్యాంక్ స్ట్రీట్' నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos