ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరులో ఓ గిరిజన మహిళపై దాడి చేసి అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. కొలికపూడిపై వచ్చిన ఆరోపణలపై అధిష్టానం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరడంతో ఆయన ఇవాళ పార్టీ పెద్దల ముందు హాజరై రాతపూర్వక వివరణ ఇచ్చారు. దీనిపై అధిష్టానం విచారించి కొలికపూడిపై తదుపరి చర్యల్ని ఖరారు చేయబోతోంది.
తిరువూరు నియోజకవర్గంలోని ఎ. కొండూరు మండలం గోపాలపురంలో టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి ఈ నెల 11న వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. ఆయన సోదరుడు అయిన వైసీపీ నేత భూక్యా కృష్ణకు చెందిన భూ వివాదంపై హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కృష్ణ భార్యను సైతం ఇంట్లో దూరి కొట్టి అవమానించారని ప్రత్యర్థులు ఆరోపించారు. దీనిపై టీడీపీ హైకమాండ్ కొలికపూడిని వివరణ కోరింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఇవాళ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొలికపూడి.. రాతపూర్వకంగా వివరణ ఇచ్చి, అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చేది వేరని, వాస్తవం వేరని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన వారే ఇవాళ తనతో కలిసి పనిచేస్తున్నారని కొలికపూడి తెలిపారు. తిరువూరు ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు.
మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. కొలికపూడి గీత దాటినట్లు తెలుస్తోందన్నారు. చంద్రబాబు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, ఇకనైనా వ్యవహారశైలి మార్చుకుని అందరితో కలిసి ముందుకెళ్లాలని కొలికపూడికి సూచించారు. కొలికపూడిపై చేసిన విచారణ నివేదికను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పిస్తామని, దాన్ని బట్టి చర్యలు ఉంటాయని వర్ల రామయ్య అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos