ఏపీ - తెలంగాణ మధ్య జల వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌లో మోటార్లు ఆన్ చేసి హంద్రీ-నీవా ద్వారా రాయలసీమకు కృష్ణా నీటిని రైతులతో కలిసి విడుదల చేసిన సీఎం చంద్రబాబు .. ఎత్తిపోతల వద్ద రైతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి జలహారతి ఇచ్చారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా నిన్న ఢిల్లీలో జరిగిన సీఎంల భేటీపై స్పందించారు.
తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిద్దామని తెలంగాణకు ప్రతిపాదించారు. తెలంగాణ, ఏపీ రెండూ రాష్ట్రాలూ బాగుండాలన్నారు. గోదావరి బోర్డు హైదరాబాదులో.. కృష్ణా బోర్డు విజయవాడలో పెడుతున్నామన్నారు. శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులకు తామే డబ్బులిచ్చి పనులు చేస్తామన్నారు. అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకోమని తెలంగాణకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. రాయలసీమకు ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలని, కనీసం రెండు మెట్ట పంటలు వేసుకునేలా నీటి సౌకర్యం కల్పించాలని, ఇదే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. వేదావతిని పూర్తి చేస్తే ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలకు ఉపయోగపడుతుందని, త్వరలో ఆ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఘోరకల్లు మరమ్మతు పనులు కూడా 96 కోట్లతో ప్రారంభిస్తామన్నారు. అలగనూరు బండ్ 2021లో దిగిపోతే వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, రూ.36 కోట్లు మంజూరు చేసి పూర్తి చేస్తామని వెల్లడించారు. అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీవా బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు తీసుకెళ్తామన్నారు. ఈ ఏడాది ఏ విధంగా కుప్పంకు నీళ్లు వెళ్తున్నాయో, వచ్చే ఏడాది చిత్తూరుకు నీళ్లు అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మరోవైపు నిన్న ఢిల్లీలో జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సానుకూలంగా సాగినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఏపీ ప్రాజెక్టులకు టెలిమెట్రీ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos