తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ టీటీడీకి భారీ విరాళాన్ని అందజేశారు. ఒక్క రోజు మొత్తం అన్న ప్రసాద వితరణకు అయ్యే వ్యయం 44 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా చెల్లించారు. ఈ మొత్తంతో కూడిన డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి అందజేశారు. అదేవిధంగా చిత్తూరుకు చెందిన చింతల దివ్యాంత్ రెడ్డి అనే భక్తుడు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు ఈ మొత్తంతో కూడిన డీడీని దాత తిరుమలలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
అదేవిధంగా మంత్రి నారా లోకేశ్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం లోకేశ్ పడుతున్న తపనను, ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో లోకేశ్ తీసుకువస్తున్న వినూత్న మార్పులు భావి తరాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని పవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు లోకేశ్ వేస్తున్న అడుగులు అభినందనీయమన్నారు. కేవలం విద్యారంగమే కాకుండా, ఐటీ మంత్రిగా రాష్ట్రంలో దిగ్గజ సంస్థల స్థాపనకు లోకేశ్ చేస్తున్న కృషి యువతకు కొత్త ఆశలు చిగురింపజేస్తోందని కొనియాడారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా లోకేశ్ సిద్ధం చేసిన ప్రణాళికలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో లోకేశ్ నిరంతరం కొనసాగుతూ, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో వీరిద్దరి మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం, పరస్పర గౌరవం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos