ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐదేళ్లు పదవిలో కొనసాగరని ..ఆయన స్థానంలో లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లిపోతారంటూ జేసీ అభిప్రాయపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మనుగా ఉండగా, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వీరి మేనల్లుడు దీపక్ రెడ్డి సీడాప్ చైర్మనుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన జేసీ కుటుంబం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు దివాకర్ రెడ్డి.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అనుభవంతో చెబుతున్నానని, త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు చోటుచేసుకోబోతుందని విశ్లేషించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానంలో ఆయన కుమారుడు లోకేశ్ సీఎం అవుతారని దివాకర్ రెడ్డి అంచనా వేశారు. తాను ఇలా చెబుతున్నది చంద్రబాబు బలవంతంగా వైదొలగమని కాదని, ఆయన అనుభవం జాతీయ రాజకీయాలకు అవసరమని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు జాతీయ రాజకీయాలు నడిపే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయని జేసీ చెప్పారు. వచ్చే ఎన్నికల లోగా ఈ మార్పు జరగొచ్చని తాను అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యానించేందుకు జేసీ నిరాకరించారు. తనకు పవన్ కల్యాణ్ తో అంతగా వ్యక్తిగత సంబంధాలు లేవని, ఆయన రాజకీయ భవిష్యత్ కోసం తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని చెప్పారు. తన సమకాలీకుడైన జీసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos