ఏపీలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవి పై రెండు రోజులుగా రచ్చ కొనసాగుతోంది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీని పైన పవన్ మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి.. ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయటం పైన జనసైనికులు మండి పడుతున్నారు. ఇదే అంశం పైన సోషల్ మీడియా వేదికగా పవన్ - లోకేష్ మద్దతు దారుల మధ్య వార్ ముదురుతోంది.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్.. ఇటీవల హోం మంత్రి పైన చేసిన వ్యాఖ్యలు, తిరుపతి తొక్కిసలాట ఘటనలో స్పందించిన తీరుతో కొత్త రాజకీయం మొదలైంది. పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొద లైంది. దీంతో, నేరుగా పవన్ ను టార్గెట్ చేయకుండా.. పవన్ తో పాటుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే, పవన్ హోదా తగ్గకుండా మరెవరికీ డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు. కానీ కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్లు చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల కిందటే కడప జిల్లా పర్యటనలో చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి దీనిపై డిమాండ్ చేసారు కానీ.. చంద్రబాబు స్పందించ లేదు. దీనికి మద్దతుగా వరుసగా టీడీపీ ముఖ్య నేతలు తెర పైకి వచ్చారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో టీడీపీ తరపున నాయకత్వం వహిస్తున్న నేత వర్మ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటి అంటూ మాట్లాడారు. ఇప్పటికే వేడివేడిగా ఉన్న ఈ అంశంపై వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మరోవైపు డిప్యూటీ సీఎం పదవిని పవన్ తో పాటుగా లోకేష్ కు ప్రతిపాదించటం పైన జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఏ విధంగా కూటమి అధికారంలోకి రావటానికి కారణమయ్యారో వివరిస్తూ వారు పోస్టింగ్స్ పెడుతున్నారు. దీంతో, సోషల్ మీడియా వేదికగా టీడీపీ - జనసేన మద్దతుదారుల మధ్య వార్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈ వివాదం పైన బీజేపీ అధినాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. పదవుల విషయంలో చర్చలతో పరిష్కరించుకోవాలని..కూటమి సఖ్యత పై ప్రభావం పడేలా ఉండకూడదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ వివాదం పై చంద్రబాబు, పవన్ స్పందించ లేదు. దీంతో..ఈ రచ్చ రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.
మరోవైపు టీడీపీ నేతల వాదన మరోవిధంగా ఉంది. తమిళనాడులో ఉదయనిధిని స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈ కారణంగా ఆయనే తర్వాత డీఎంకే వారసుడు అన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇదే అభిప్రాయాన్ని ఏపీలో కూడా కల్పించేలా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నేతలు అంటున్నారు. ఇది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. పార్టీకి , ప్రభుత్వానికి తదుపరి నాయకత్వం అన్న సంకేతాలను పంపాలన్న ఉద్దేశంతోనే ఈ డిమాండ్ చేస్తున్నామని, ఇందులో తప్పేముందని టీడీపీ నేతలు అంటున్నారు. దీనిపై రెండు పార్టీల అధినేతలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos