ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి గాను పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సాగుతోంది. ఈ క్రమంలోనే శాన్‌ఫ్రాన్సికో లోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని లోకేశ్ తెలిపారు. యువతకు రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఆరు పాలసీలను ప్రకటించారని చెప్పారు.
ప్రవాసాంధ్రుల నుంచి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.
కాగా నారా లోకేష్ టెస్లా కేంద్ర కార్యాలయంలో సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశం అయ్యారు. 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ, సహకారాలు అవసరమని లోకేష్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలు రాష్ట్రంలో విజయవంతంగా ఉత్పత్తి చేస్తున్నాయని గుర్తు చశారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై దృష్టి సారించారని.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని లోకేష్ వివరించారు. పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఏపీలో అమలు చేస్తున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టి సారిస్తే సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే డేటా సెంటర్, ఐటీ హబ్‌లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజి పరిష్కారాలు అవసరమన్నారు. టెస్లా ఏపీకి వస్తే వస్తే ఈ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుందని.. రాష్ట్రవ్యాప్త EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం వహించే అవకాశం లభిస్తుందని తెలిపారు. అలాగే ఆర్ అండ్ డి, ఇన్నోవేషన్‌లో భాగంగా టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేసే అంశాలనూ పరిశీలించాలని లోకేష్ కోరారు.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని వారికి తెలిపారు. భారత్‌లో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఆంధ్రప్రదేశ్‌లో డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించారు. ఈక్వెనెక్స్ ముందుకు వస్తే తాము అన్నివిధాలా సహాయ, సహకారాలు అందజేస్తామని లోకేశ్ చెప్పారు.
రెండో రోజు లోకేశ్ పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. గూగుల్ సీటీఓ ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సిఇఓ డాక్టర్ వివేక్ లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండి నీరజ్ అరోరా, ఐ స్పేస్ ప్రెసిడెంట్ రాజేశ్ కొత్తపల్లి, సీఎఫ్ఓ ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో లోకేశ్ వన్ టు వన్ భేటీ అయ్యారు. ఏపీలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos