తెలుగు రాష్ట్రాలలో ఈ నవంబర్ మాసంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇక ఇదే సమయంలో చలికి తోడు వర్షాలు కూడా పడుతున్న క్రమంలో భిన్న వాతావరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.
దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ వైపు దిశగా పయనుంచి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఎల్లుండి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో 24వ తేదీన రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఆ తర్వాత అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవడానికి కారణం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదే సమయంలో అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఇక ఏపీలో ఈ నెల 27, 28 తేదీలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా రైతులు ఇప్పటినుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు జాగ్రత్తలు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఏపీలో చలి తీవ్రత పెరిగింది. ఇక ఇదే సమయంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ వాసులు వణికిపోతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos