కడప: ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని..తెలుగువారి ఆత్మ గౌరవం, పేదవారి గుండెల్లో తీపి జ్ఞాపకమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్  అన్నారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అని నినదించి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు.  ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగువారికి పండుగ రోజని, ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజం ఒక్క టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. మహానాడు వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలుగు తేజం, పౌరుషం, ఆత్మగౌరవం ఎన్టీఆర్

మహానాడుకు సముద్రంలా పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, చెళ్లెమ్మలకు, టీడీపీ వీరాభిమానులకు అందరికీ నమస్కారం. మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం. నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా, పార్టీని మరింత బలోపేతం చేసేలా...రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా సాగాయి. ఈ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ-రాజకీయ సార్వభౌముడు... నందమూరి తారక రామారావు జయంతి. మహనీయులు, కారణ జన్ములు ఎన్టీఆర్ గారికి మహానాడు వేదికగా ఘన నివాళులు అర్పిద్దాం. సాధారణంగా ఒక వ్యక్తిని గాని, ఒక సినిమా హీరోను గాని, ఒక రాజకీయ నాయుకుడిని గాని కొంత మంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలు అభిమానిస్తాయి.  కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికే పండుగ రోజు. ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు.  మనకు తెలిసిన, మన కళ్ల ముందు కనిపించిన యుగపురుషుడు ఎన్టీఆర్.  ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు.

సినీ-రాజకీయాల్లో సింహం :  

ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు – మరెన్నో మెరుపులు, ఇంకెవరి జీవితంలో లేని మజీలీలున్నాయి. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి.. తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్‌గా ఎదగడం.. ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం.. అనితరసాధ్యం. ఎన్టీఆర్‌ జీవితం పూల పాన్పు కాదు...నిరంతర పోరాటంతోనే ఎదిగారు. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆభరణాలు. పాలు అమ్ముతూ చదువుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం చేసినా, సినిమాల్లో నటించినా, రాజకీయాల్లోకి వచ్చినా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడలేదు. ఒక సామాన్య రైతుబిడ్డగా పుట్టి.. 33 ఏళ్లు వెండితెర జీవితంలోనూ, 14 ఏళ్లు రాజకీయ జీవితంలోనూ అద్వితీయ చరిత్ర సృష్టించారు. అందుకే, ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు... నరాల్లో ఉత్తేజం వస్తుంది. కొండనైనా ఢీ కొట్టగలం అనేంతగా ఆత్మవిశ్వాసం వస్తుంది. పట్టుదల వస్తుంది. ఎన్టీఆర్ విగ్రహం ఒకసారి చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి మీకు వస్తుంది.చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ నాటి అవినీతి రాజకీయాలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన గర్జించారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే ఆకాశం ఉరిమినట్టు ఉండేది.  పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన రికార్డ్ సృష్టించిన వ్యక్తి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే.  

ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా

ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా. రైతుకు నేస్తం.. తాడిత పీడితులకు ధైర్యం... యువతకు భవిష్యత్తు... మహిళలకు అండ... కార్మికులకు అభయం.... అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు మన ఎన్టీఆర్ . తనను వెండితెర ఇలవేల్పు చేసిన తెలుగుప్రజల రుణం తీర్చుకునేందుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఎంత కష్టమైనా వెనకడగు వేయలేదు. 60 ఏళ్ల మయసులో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారు. అవినీతి రాజకీయాలను కడిగి పారేయాలని పట్టుదలే ఆయన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది. ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు’ అనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు.  అధికారం అంటే బాధ్యత అని చాటి చెప్పారు. పదవి అంటే సేవ చేసే అవకాశమని నిరూపించారు. పాలకులు అంటే సేవకులు అని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పార్టీ పెట్టి....కూడు గూడు గుడ్డ తన విధానం అన్నారు.  పార్టీ గుర్తులో ఇల్లు, నాగలి, చక్రం తో తన ప్రాధాన్యాలు వివరించారు.  43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రూపొందించిన జెండా శాశ్వతంగా ఉంటుంది. తెలుగుజాతి ఉన్నంతవరకూ ఎన్టీఆర్ గుర్తుంటాడు. ఈ జెండా ప్రజలకు సేవ చేస్తుంది.

రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది

పసుపు జెండా అంటే...దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన జెండా! పసుపు జెండా అంటే....తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా,  తెలుగవారిలో ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పిన జెండా.  పసుపు జెండా అంటే....ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా...పసుపు జెండా అంటే....రైతన్నల కన్నీరు తుడిచి వెన్నంటే ఉన్న జెండా... పసుపు జెండా అంటే...విజన్ తో తెలుగుజాతికి విజయాన్నిచ్చిన జెండా! తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భవిష్యత్, భరోసా! ఆ జెండా చూస్తుంటు ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన తో పాలనలో కొత్త ఒరవడికి ఎన్టీఆర్ ఆద్యులుగా నిలిచారు.  పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని రెండు రూపాయలకు కిలో బియ్యం తెచ్చారు.  అందరికీ పక్కా ఇళ్లు... బడుగులకు జనతా వస్త్రాలు అందించారు. వృద్ధాప్య పెన్షన్లు, రూ.50కే హార్స్‌ పవర్‌ విద్యుత్‌, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు... సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం... ఇలా సంక్షేమాన్ని - అభివృద్ధిని సమతుల్యం చేశారు.  పటేల్‌ `పట్వారి వ్యవస్థ రద్దు, సింగిల్ విండో విధానం, బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది ఎన్‌టిఆరే.

రాజకీయాల్లోకి రాకముందే ప్రజా సేవ :

రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎన్టీఆర్ ప్రజల కష్టాల గురించే ఆలోచించేవారు.  అందుకే ప్రజలు కష్టాల్లో ఉంటే నేనున్నానంటూ ముందుకొచ్చి సాయం చేసేవారు. 1952 సంవత్సరంలో రాయలసీమలో కరువు వచ్చినప్పుడు,1962లో భారత్‌`చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడూ విరాళాలు సేకరించారు. 1965లో భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు, 1972లో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు, 1977లో దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో నేనున్నానని అండగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ . మార్చి 29, 1982లో టీడీపీ ఏర్పడిన రోజు . ఈ మార్చికి 43 ఏళ్లయింది. 4 దశాబ్ధాల్లో ఎన్నో మైలురాళ్లు దాటాం. ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన స్పూర్తితోనే సంక్షేమానికి, సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నాం. 2024లో ప్రజలిచ్చిన తీర్పుతో విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నాం. పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తపించారు. ఆయన ఆశయం కోసం శాశ్వతంగా పేదరిక నిర్మూలన చేసి ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది టీడీపీ సంకల్పం. నా తెలుగు కుటుంబం , ఆరు శాసనాలు... ఈ రెండు గేమ్ ఛేంజర్ గా తయారవుతాయి. ఎన్టీఆర్ ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి.  2047 నాటికి ప్రపంచంలోనే అగ్రభాగంలో తెలుగు జాతి నిలుస్తుంది.  ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పిస్తూ, ఉన్నతంగా ఎదగాలి, విజయం సాధించాలని ఈ కడప మహానాడులో సంకల్పం తీసుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos