బిగ్ స్టోరీఏపీలో కడప వేదికగా మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పనిచేస్తున్నారు. మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేసారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ మహానాడులో తీసుకునే రాజకీయ నిర్ణ యాల పైన ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బాధ్యతలను పార్టీ సీనియర్లకు అప్పగించారు. కాగా, మంత్రి లోకేష్ కు పార్టీలో - ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలని కొంత కాలంగా పార్టీ నేతల నుంచి డిమాండ్ వస్తోంది. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ పైన వివాదం కొనసాగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ పైన జనసేన నేతలు విభేదించారు. దీంతో, ఈ అంశం ఎవరూ ప్రస్తావన చేయవద్దని టీడీపీ ఆదేశించటంతో ఆ చర్చ ఆగిపోయింది.
కాగా, ఇప్పుడు పార్టీలో కీలక బాధ్యతల పైన డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై పెద్దఎత్తున ఒత్తిడి వస్తోంది. పార్టీ అధినేతగా - సీఎం బాధ్యతల్లో చంద్రబాబు బిజీగా ఉండటంతో పార్టీ నిర్వహణ ఇక లోకేష్ కు అప్పగించాలనే చర్చ వినిపిస్తోంది. 2014-19 కాలంలో పార్టీని విస్మరించిన కారణంగానే 2019 ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వంపైనే దృష్టి పెడితే పార్టీ దెబ్బతింటుందని, పార్టీ కార్యకలాపాలకు కూడా నిర్ణీత సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి కచ్చితంగా సమయం కేటాయిస్తామని చంద్రబాబు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు కూడా అది సాధ్యం కావడం లేదు.
ఈ పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్లో వేగంగా మార్పు కనిపిస్తోంది. పార్టీ పైన దృష్టి పెట్టకపోతే 2014- 19 అనుభవాలు పునరావృతమవుతాయని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని అన్ని జిల్లాల నుంచి డిమాండ్ వస్తోంది. దీని పైన చంద్రబాబు ఆలోచన ఏంటనేది వెల్లడి కావాల్సి ఉంది. కడపలో మూడ్రోజులపాటు జరిగే మహానాడులో ఈ అంశంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ నేతలు మాత్రం లోకేష్ కు కొత్త బాధ్యతలు ఖాయమని చెబుతున్నారు.
నారా లోకేష్ ఇప్పటికే సమర్థమైన లీడర్ గా.. పార్టీని నడిపించగల ప్రతిభావంతుడిగా నిరూపించుకున్నారు. పాదయాత్ర చేశారు. పార్టీ వ్యవహారాల్ని సమన్వయం చేస్తున్నారు. ఒక్క నారా లోకేష్ మాత్రమే కాదు..సడెన్ గా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి పరిటాల శ్రీరామ్ వరకూ ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ టీడీపీకి బలమైన యువ నాయకత్వం ఉంది. వారందరికీ అదనపు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును నారా లోకేష్ కు ఇవ్వాలన్న అభిప్రాయం పార్టీలో బలంగా ఉంది. లోకేష్ అటు ఢిల్లీ వ్యవహారాలతో పాటు ఇటు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
ఇప్పుడు నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేస్తే టీడీపీని నడిపించగల భావితరం ప్రతి జిల్లాలోనూ బలంగా తయారవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ క్యాడర్ మహానాడులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓ కొత్త తరంలోకి టీడీపీని తీసుకెళ్లే మహానాడుగా.. కడప మహానాడు చరిత్రలో నిలిచే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos