తెలుగు తమ్ముళ్ల పండుగగా చెప్పుకునే టీడీపీ మహానాడు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారి కడపలో జరగబోతున్న మహానాడు కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది పార్టీ అధికారం పూర్తిస్థాయిలో లోకేష్ చేతులకి అప్పగించబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మే 27 నుంచి అంటే రేపటి నుంచి మూడు రోజులపాటు మహానాడు జరగనుంది.
నిజానికి గత జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పటి నుంచి పార్టీలో కీలక నిర్ణయాలన్నీ లోకేష్ తీసుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ చేయడం జనసేనతో పొత్తు ఏర్పడినప్పుడు మాటల్లోనూ చేతల్లోనూ.. ఎక్కడా ఆ పొత్తు డిస్టర్బ్ కాకుండా వ్యవహరించడం ప్రసంగాల్లో పదును పెంచడం కార్యకర్తల విశ్వాసం పొందడం ఇలా అన్ని విధాల పార్టీలో పట్టు సాధించారు లోకేష్. ఇప్పుడు ఏకంగా మహానాడు వేదికగా ఇకపై పార్టీలో కీలక నిర్ణయాలు తానే తీసుకుంటూ అధినేత చంద్రబాబు నాయుడు పై భారం తగ్గేలా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ప్రచారం బలంగా సాగుతోంది. ఆ సంకేతం కూడా ప్రత్యర్థి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా చెప్పుకునే కడప నుండి రాజకీయ వర్గాలకు పంపించడం లోకేష్ వ్యూహంగా చెబుతున్నారు. ఇక లోకేష్ కూడా చాలా కీలకమైన ఆరు ప్రతిపాదనలను మహానాడు వేదికగా స్వయంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోని కీలకమైన పాయింట్ తెలుగువారి ఆత్మగౌరవం. ఇప్పుడు దానిని మరింత ముందుకు తీసుకుని వెళ్లేలా కృషి చేసి .. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు యువతను ఏకతాటి పైకి తీసుకుని రావడం ప్రజెంట్ జనరేషన్ లోనూ టీడీపీని బలోపేతం చేయడం వంటి యాక్షన్ ప్లాన్ తో " తెలుగుజాతి విశ్వఖ్యాతి" అనే ప్రతిపాదన లోకేష్ స్వయంగా చేయబోతున్నారు
అదేవిధంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి మహిళలు టీడీపీకి పెద్ద సపోర్టుగా ఉంటూ వచ్చారు. క్షేత్రస్థాయిలో అంటే పల్లెల్లోనూ క్షేత్రస్థాయికి టీడీపీ పాతుకుపోయిందంటే దానిలో మహిళల పాత్ర చాలా ఉంది. మారిన జనరేషన్ దృష్ట్యా మళ్లీ అదే స్థాయిలో మహిళల మద్దతు పొందేలా టీడీపీని వారిలోకి తీసుకుని వెళ్లేందుకు పార్టీలో మహిళల పాత్ర, మహిళల నాయకత్వం మరింత పెరిగేలా కొన్ని కీలకమైన నిర్ణయాలను మహానాడు వేదికగా లోకేష్ ప్రతిపాదించబోతున్నారు.
అలానే.. ఆర్థికంగా అట్టడుగు వర్గాలకు చేయూత అందించే విధంగా పార్టీపరంగా 'పేదలకు సేవ ' అనే పేరుతో సోషల్ రీ - ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ను నారా లోకేష్ మహానాడులో ప్రతిపాదించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి బలహీన వర్గాలకు టీడీపీ హయంలో రాజకీయంగా, ఆర్థికంగా పెద్ద ఎత్తున సపోర్ట్ లభించిందని ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది. ఎన్టీఆర్ హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గాలకు 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తరహాలోనే ప్రస్తుతం ఎస్సీ సామాజిక వర్గీకరణలో ముందుగా స్టెప్ తీసుకుంది కూడా టీడీపీ నే. వీటన్నిటినీ వీలైనంత ఎక్కువగా ప్రచారం చేస్తూ బలహీన వర్గాల్లోకి మరింత గట్టిగా పార్టీని తీసుకునే వెళ్లేలా ఈ ప్రతిపాదన చేయబోతున్నారు.
మొన్నటి ఎన్నికల్లో సీట్ల కేటాయింపు దగ్గర నుంచి పవర్ లోకి వచ్చాక మంత్రి పదవుల భర్టీ వరకూ యువతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నించింది. దీనిలో లోకేష్ మార్కు బలంగా కనిపించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పార్టీలో యువ నాయకత్వం, యువకుల ప్రాతినిధ్యం పెంచే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. లోకేష్ చుట్టూ ఉన్న టీం కూడా యువకులతో నిండిపోయి ఉంది. ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులోనూ సీనియర్ నేతలను నిర్మొహమాటంగా పక్కన పెట్టారు. వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ లాంటి యువకులు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు యువకుల ప్రాతినిద్యం మరింత పెంచేలా పార్టీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ "యువగళం" ప్రతిపాదన మహానాడు లో లోకేష్ చేయబోతున్నారు.
అదేవిధంగా వ్యవసాయంలో ఆధునికత పెంచడం, రైతులకు టెక్నాలజీని అందుబాటులోకి తేవడం, నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి వ్యవసాయానికి పెద్దపీట వేయడం వంటి కార్యక్రమాలు ఎజెండాగా "అన్నదాతకు అండ " అనే ప్రతిపాదన లోకేష్ చేయబోతున్నారు.
వాస్తవంగా 2014 -19 నుండి లోకేష్ కార్యకర్తలకు అండగా ఉండే ప్రయత్నం చేశారు. అప్పట్లో అదంత ఫలించలేదు. కానీ గత ఐదేళ్లు ఆయన బాగా నలిగారు. కార్యకర్తలతో పూర్తిస్థాయిలో మమేకమయ్యారు. నిజానికి ఎన్టీఆర్ హయాం నుండి కార్యకర్తలకు పెద్దపీట వేయడం టీడీపీకి ఆనవాయితీగా వస్తోంది. అయితే చంద్రబాబు హయాంలో డెవలప్మెంట్ కి, అడ్మినిస్ట్రేషన్ కు పెద్దపేట వేస్తూ కార్యకర్తల సంక్షేమం పట్ల దృష్టి పెట్టలేదనే విమర్శ పార్టీలో ఉన్న మాట వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చాలామంది కీలక నాయకులు సైలెంట్ అయిపోయిన సమయంలో కార్యకర్తలే ఆయనకు అండగా ఉంటూ పార్టీని బతికించారనేది పార్టీ హై కమాండ్ గుర్తించింది. అందుకనే ఈసారి కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి తగిన కార్యక్రమాలు రూపకల్పన చేసేలా " కార్యకర్తే అధినేత " అనే ప్రతిపాదనను లోకేష్ తెరపైకి తీసుకురాబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కడపలో మహానాడు జరపాలని నిర్ణయించినప్పటి నుంచీ లోకేష్ మార్కు కనపడేలా టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఆదినాయకత్వం ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లోనే ఉన్నా పార్టీ ఎగ్జిక్యూషన్ మొత్తం ఇకపై చిన్న బాసు లోకేష్ చేతుల్లోనే ఉండబోతుందనేది ఇప్పటికే పార్టీలో అందరికీ తెలిసినా ... ఆ విషయం బహిరంగంగా ప్రజల్లోకి కడప మహానాడు తీసుకెళ్లబోతోంది. అది ఎంత ఎఫెక్టివ్ గా ఉండబోతుందనేది ఈ మూడు రోజుల పసుపు పండుగ తర్వాత తెలియబోతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos