తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. విజయనగరం జిల్లాలోని చారిత్రక బొబ్బిలి కోటను సందర్శించిన ఆయన, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బేబినాయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి కోటలోని మ్యూజియంను సందర్శించి, బొబ్బిలి రాజుల వంశవృక్షాన్ని, వాడిన వస్తువులను పరిశీలించారు. బొబ్బిలి రాజుల చరిత్ర ఎంతో గొప్పదని, రెండు శతాబ్దాల నాటి వస్తువులను జాగ్రత్తగా భద్రపరచడం అభినందనీయమని మల్లారెడ్డి ప్రశంసించారు. పర్యటనలో భాగంగా ఆయన తాండ్రపాపారాయుడు ఉపయోగించిన కత్తిని చేతబట్టి ఫొటోలకు ఫోజులిచ్చారు. కోట విశేషాలను వివరించిన ఎమ్మెల్యే బేబినాయనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది సాధారణ పర్యటనలా కనిపించినా, దీని వెనుక విద్యాసంస్థల విస్తరణ ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. బొబ్బిలిలోని ఓ విద్యాసంస్థ ప్రాంగణంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న స్థానిక యాజమాన్యం విన్నపం మేరకే మల్లారెడ్డి అక్కడికి వెళ్ళినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు డీమ్డ్ యూనివర్సిటీలు, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు నడుపుతున్న ఆయన, ఏపీలోనూ విద్యాసంస్థలను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవలే విశాఖపట్నం, తిరుపతిలో కొన్ని కాలేజీలను కొనుగోలు చేసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు మల్లారెడ్డి. ఈ క్రమంలోనే ఆయన ఆయా కాలేజీలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
కాగా, మల్లారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీతోనే ప్రారంభించారు. ఆయన విద్యాసంస్థలు నడిపిస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు.. ఆయన టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. అనంతరం కేసీఆర్ కేబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి మళ్లీ మేడ్చల్ నుంచి గెలిచారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos