రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేడు ప్రారంభించారు. దీనివల్ల 1,48,419 మంది ఇంటర్ విద్యార్థులకు భోజనం అందనుంది
విజయవాడ పాయకాపురంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 కాలేజీలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ వాటికి భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ ఉచిత మధ్యాహ్న భోజనం అనేది కాలేజీలో అందరు విద్యార్థులకూ కాదు. పేద విద్యార్థులకు మాత్రమే. అంటే వారు దారిద్ర్యరేఖ (BPL)కు దిగువన ఉన్న వారు అయివుండాలి. అలాంటి విద్యార్థులు చదువుకి దూరం అవ్వకూడదు, వారిని ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ మిడ్ డే మీల్‌లో విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం ఉండేలా ప్లాన్ చేశారు. అందుకే కోడిగుడ్డు, చిక్కీని యాడ్ చేశారు. వీటి ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగవ్వడమే కాకుండా.. వారు చదువులోనూ రాణిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ పథకం ప్రారంభమైంది కాబట్టి .. విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని... వారు ఏం చెబుతున్నారో, ఏం కోరుకుంటున్నారో చూసి.. దాన్ని బట్టీ.. ప్రభుత్వం మార్పులు-చేర్పులు చేస్తుందని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos