ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో సరికొత్త శకం మొదలైంది. దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పూర్తి సౌరశక్తితో పనిచేసే ‘సెంట్రలైజ్డ్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్’ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక వంటశాల ద్వారా వేలాది మంది విద్యార్థులకు పరిశుభ్రమైన, రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా సీకే దిన్నెతో పాటు కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున, కడపలో ఒకటి... మొత్తం ఐదు స్మార్ట్ కిచెన్‌లను మంత్రి లోకేశ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కింద ఈ ఐదు వంటశాలల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 వాహనాల ద్వారా ఆహారాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తారు. ఈ వాహనాలను, వంట కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్వో ప్లాంట్‌ను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, ఆర్వో నీటిని మాత్రమే ఉపయోగిస్తూ ఇక్కడ వంట చేస్తారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రుచి, శుచితో కూడిన భోజనాన్ని నిర్దేశిత సమయానికి అందిస్తామని సిబ్బంది మంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమం పనితీరును సమీక్షించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసే ఆలోచన ఉందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. “సీకే దిన్నె స్మార్ట్ కిచెన్ ఒక పైలట్ ప్రాజెక్ట్. దీని పనితీరును నిశితంగా పరిశీలిస్తాం. తల్లిదండ్రుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుని, అవసరమైన మార్పులు చేసి మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కడప జిల్లాలోని 11 మండలాల్లో 33 స్మార్ట్ కిచెన్‌లను ఏర్పాటు చేసి, 1,24,689 మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. అనంతరం స్మార్ట్ కిచెన్‌ను సందర్శించిన ఆయన, వంటకు ఉపయోగిస్తున్న సరుకుల నాణ్యతను, తయారీ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos